Hari Hara Veera Mallu: ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం మరోసారి వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా వినబడుతున్న వార్తలను నిజం చేస్తూ.. మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘ఇంతకు ముందు ప్రకటించిన విధంగా జూన్ 12వ తేదీకి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము’ అని అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనతో మరోసారి ‘హరి హర వీరమల్లు’ విడుదల వాయిదా తప్పడం లేదు. దీంతో, జూన్ 12 కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Akhil Zainab Wedding: అఖిల్ పెళ్లిలో చైతూ హల్చల్.. సెలబ్రిటీల సందడి మొదలైంది
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేయక తప్పలేదు. ‘‘అచంచలమైన ఓపిక, నమ్మకంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతకు ముందు ప్రకటించిన విధంగా జూన్ 12వ తేదీకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎంతగానో ప్రయత్నించాం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కాస్త ఆలస్యంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) యొక్క ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ఈ ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రాన్ని మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు గిఫ్ట్‌గా గొప్ప చిత్రాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం’’ అని మేకర్స్ ప్రకటనలో తెలిపారు.
Also Read- Manchu Vishnu: మంచు విష్ణు ఫోన్‌లో హాట్ లేడీ ఫోన్ నంబర్.. ఎవరో తెలిస్తే?
మరోవైపు, సోషల్ మీడియాలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంపై తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం మేము గమనించాము. చాలామంది తమకు తోచింది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాము. దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం వేచి ఉండాలని కోరుతున్నాం. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని నమ్మవద్దని తెలియజేస్తున్నాం. ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారని తెలిపారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. ఎం. రత్నం సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న, ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు