Madhuri Srinivas: తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జంట ఏదైనా ఉంది అంటే అది దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జంట. రీల్స్ చేస్తూ, పరిశ్రమ నడుపూతూ ఆమె ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఇటీవల ఆమె బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి వచ్చారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చిన డబ్బును పేదలకు పంచుతూ దివ్వెల మాధురి మరో సారి వార్తల్లో నిలిచారు. ఈ మానవత్వపు ప్రయాణంలో భాగంగా, వారు శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం, అల్లాడ గ్రామంలో ఒక నిస్సహాయ మహిళకు అండగా నిలిచారు. సహాయం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం చేయాలనే లక్ష్యంతో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ముందుకు సాగుతున్నారు. అల్లాడ గ్రామానికి చెందిన హెచ్. కుమారి గత కొంతకాలంగా ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతూ, ఆర్థికంగా స్థోమత లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట వెంటనే స్పందించారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న కుమారిని వ్యక్తిగతంగా పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులకు కొంతైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో, రూ. లక్షా పదివేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని నేరుగా కుమారి కుటుంబసభ్యులకు అందజేసి, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read also-Bigg Boss 9 Telugu: భరణీని చిక్కుల్లో పడేసిన తనూజ.. డీమాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాడా?..
తాజాగా దీనికి సంబంధించి వీడియోను దివ్వెల మాధురి షేర్ చేశారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును వ్యక్తిగత విలాసాలకు కాకుండా, ఇలా పేదల పాలిట ఆపద్బాంధవులుగా మారుతున్న దువ్వాడ శ్రీనివాస్, మాధురి చర్య నేటి యువతకు, సినీ ప్రముఖులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని చూసిన నెటిజన్లు దివ్వెల మాధురిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే ఆపదలో ఉన్న వారికి సాయం అందిస్తూ ఉండాలని వారు కోరుకుంటున్నారు.

