Director Teja: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, థియేటర్ల వద్ద సామాన్య ప్రేక్షకుడు పడుతున్న ఇబ్బందులపై ప్రముఖ దర్శకుడు తేజ తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న ఆయన, సినిమా రంగం మనుగడ సాగించాలంటే తక్షణమే చేపట్టాల్సిన మార్పుల గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
Read also-Bigg Boss9: ‘ఇమ్మూన్యుల్ ఒక వెదవ.. ఎంత చెప్పినా వినలేదు’.. తనూజ షాకింగ్ కామెంట్స్
అదుపు తప్పిన క్యాంటీన్ ధరలు
ఈ సమావేశంలో తేజ ప్రధానంగా ప్రస్తావించిన అంశం థియేటర్లలోని తినుబండారాల ధరలు. “ప్రస్తుతం సినిమా టికెట్ ధర కంటే పాప్‌కార్న్ రేటు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రేక్షకుడు తన కుటుంబంతో కలిసి సినిమాకు రావాలంటే టికెట్ ఖర్చు కంటే క్యాంటీన్ ఖర్చే భారంగా మారుతోందని, స్వయంగా తనే పాప్‌కార్న్ కొనేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దోపిడీ అరికట్టకపోతే ప్రేక్షకులు థియేటర్లకు దూరం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
బడ్జెట్ వర్సెస్ సామాన్యుడి సౌలభ్యం
తెలుగు సినిమా ఇవాళ ‘బాహుబలి’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని, ఆ స్థాయి నాణ్యతను అందించాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని తేజ అంగీకరించారు. పెద్ద సినిమాల పెట్టుబడి తిరిగి రావాలంటే టికెట్ ధరల్లో కొంత వెసులుబాటు ఉండాలని కోరుతూనే, అది సామాన్యుడికి భారంగా మారకూడదని స్పష్టం చేశారు. “పాము చావకూడదు, కర్ర విరగకూడదు” అనే రీతిలో, అటు నిర్మాత నష్టపోకుండా, ఇటు పేదవాడు సినిమా చూడగలిగేలా సమతుల్యమైన టికెట్ ధరల విధానం ఉండాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
పైరసీ మహమ్మారి
సినిమా పరిశ్రమను పట్టిపీడిస్తున్న మరో ప్రధాన సమస్య పైరసీ. దీనిపై తేజ తీవ్రంగా స్పందిస్తూ.. ఐ బొమ్మ వంటి సైట్లు సినిమా ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. సినిమా ఎక్కడ లీక్ అవుతుందో కనిపెట్టి, ఆ మూలాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. లీకేజీని అరికట్టినప్పుడే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also-Allu Arjun: అల్లు అర్జున్ ఈ లైనప్ చూస్తే ప్యాన్స్ ఫ్యాన్స్‌కు పండగే.. గ్లోబల్ రేంజ్ ర్యాంపేజ్..
ప్రభుత్వ సహకారంపై ఆశాభావం
సినిమా రంగం అనేది ప్రాథమికంగా ప్రైవేట్ వ్యాపారమైనప్పటికీ, దానిపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని తేజ గుర్తు చేశారు. ప్రభుత్వ నియంత్రణ, సహకారం ఉంటేనే పరిశ్రమ గాడిలో పడుతుందని చెప్పారు. ఈ సమావేశం పట్ల తాను సంతృప్తిగా ఉన్నానని, థియేటర్ యజమానులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల జీవోను (GO) విడుదల చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

