Dhanush: 2013లో విడుదలైన రాంఝనా ( Raanjhanaa) సినిమా క్లైమాక్స్‌లో ధనుష్ అలియాస్ కుందన్ మరణం చూసి అభిమానులు కన్నీళ్లతో థియేటర్ల నుంచి బయటకు వచ్చారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్ నటించిన ఈ చిత్రం క్లైమాక్స్‌తో అందరినీ కట్టిపడేసింది. కానీ, 12 ఏళ్ళ తర్వాత, AIతో మార్చిన కొత్త క్లైమాక్స్‌తో సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఈ కొత్త వెర్షన్‌లో కుందన్ చనిపోకుండా కళ్ళు తెరిచే సీన్‌తో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే, ఈ మార్పుపై హీరో ధనుష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అధికారిక ప్రకటనలో ధనుష్ ఇలా అన్నాడు.
“AIతో మార్చిన క్లైమాక్స్‌తో రాంఝనాను రీ-రిలీజ్ చేయడం నన్ను బాధపెట్టింది. ఈ ముగింపు సినిమా ఆత్మను నాశనం చేసింది. దీనిలో అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సంబంధిత వర్గాలు దీన్ని ముందుకు తీసుకెళ్లాయి. నేను 12 ఏళ్ల క్రితం చేసిన సినిమా ఇది కాదు. AIని ఉపయోగించి సినిమాలను మార్చడం కళ, కళాకారులకు ఆందోళన కలిగించే విషయం. ఇది సినిమాని దెబ్బతీస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలను నియంత్రించే కఠిన నిబంధనలు రావాలని ఆశిస్తున్నాను.”
ధనుష్‌తో (Dhanush) పాటు దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ( Anand L Rai) కూడా ఈ రీ-రిలీజ్‌పై నిరాశ వ్యక్తం చేశారు. కొంతమంది ఫ్యాన్స్ ధనుష్ చేసిన కామెంట్స్ ను సమర్థిస్తున్నారు. ఒక సోషల్ మీడియా యూజర్ ఇలా రాశాడు. “ధనుష్ మాటలు చాలా బాధించాయి. AI టెక్నాలజీ ఆసక్తికరమైనప్పటికీ, క్లాసిక్ మూవీ మార్చడం అంటే హద్దు దాటడమే. సృష్టికర్తల గౌరవాన్ని కాపాడే నిబంధనలు అవసరం ” అని ఇంకొకరు, “రాంఝనా క్లైమాక్స్ అద్భుతం” ఇప్పుడు ముగింపు మారిస్తే, సినిమానే నాశనం చేసినట్లు” అని రాసుకొచ్చారు. కానీ, ఇంకొందరు నెటిజన్లు ధనుష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఓ యూజర్ ఇలా రాసుకొచ్చాడు ” సినిమా ప్రేమ ” అంటూ జోక్‌లు వేస్తున్నాడు.. నీవు నయనతారకు క్లిప్స్ వాడినందుకు లీగల్ నోటీసులు పంపినవాడివి కదా? డబ్బు కోసమే ఈ గొడవ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM
— Dhanush (@dhanushkraja) August 3, 2025