Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకుందామనుకునే వారికి, ఆయన పేరుతో అసభ్యకర వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేసేవారికి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) గట్టి షాక్ ఇచ్చింది. తారక్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులను కాపాడుతూ కోర్టు చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయన అనుమతి లేకుండా ఆయన పేరును కానీ, బిరుదులను కానీ వాణిజ్యపరంగా వాడితే కటకటాలు లెక్కపెట్టాల్సిందే! వివిధ మాధ్యమాల్లో తన అనుమతి లేకుండా, వాణిజ్య ప్రయోజనాల కోసం తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ, కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఎన్టీఆర్ కార్యాలయం (NTR Office) నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలో..
Also Read- Anil Ravipudi: ఎన్టీఆర్, కేటీఆర్.. విజ్ఞాన్ కాలేజ్ అనుభవాలను గుర్తు చేస్తుకున్న అనిల్ రావిపూడి!
కోర్టు ఉత్తర్వులోని ముఖ్యాంశాలు
NTR, Jr. NTR, NTR Jr, Tarak, నందమూరి తారక రామారావు జూనియర్, జూనియర్ నందమూరి తారక రామారావు.. వంటి పేర్లతో పాటు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ (Man of Masses), యంగ్ టైగర్ (Young Tiger) వంటి బిరుదులను, అలాగే ఆయన ఫొటో, పోలికలను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వాడకూడదు. ఒకవేళ అలా వాడితే, చట్టప్రకారం వాటిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్టీఆర్ అపారమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారని, ఆయన పేరు, రూపం ప్రజల మనస్సుల్లో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయని కోర్టు ప్రాథమికంగా గుర్తించింది. కాబట్టి, ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై ఆయనకే పూర్తి హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.
Also Read- Shruti Haasan: దమ్ము కొడుతూ.. దుల్కర్ సినిమాలో మరో తార లుక్ అదిరింది
నిర్ణీత గడువులోగా తొలగించాలి
వ్యక్తిత్వ, ప్రచార హక్కులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 మరియు 21 ప్రకారం జీవించే హక్కు మరియు స్వేచ్ఛలో భాగమని కోర్టు గుర్తించింది. ఇవి కాపీరైట్ చట్టం (1957), ట్రేడ్ మార్క్స్ చట్టం (1999) ద్వారా అమలు చేయబడతాయి. సోషల్ మీడియా, ఇతర ఇంటర్మీడియరీ ప్లాట్‌ఫామ్‌లు ఈ ఫిర్యాదును చట్టబద్ధమైనదిగా పరిగణించి, ఉల్లంఘనలకు పాల్పడే లింకులను నిర్ణీత గడువులోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్ ట్రోల్స్, గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా సరే.. ఎన్టీఆర్ పేరును లేదా రూపాన్ని వాడుకుని మర్చండైజ్ అమ్మడం, మార్ఫింగ్ ఫోటోలు, ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్ వంటి వాటి ద్వారా వాణిజ్య లాభం పొందకూడదని, అలా చేస్తే John Doe Order ద్వారా చర్యలు ఉంటాయని కోర్టు ఆదేశించింది. ఈ డిజిటల్ యుగంలో ఒక వ్యక్తి యొక్క గుర్తింపు, గౌరవానికి రక్షణ కల్పించడం ఎంత ముఖ్యమో ఈ తీర్పు నొక్కి చెబుతోంది. ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా చేసే ఎటువంటి చర్యలైనా, చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని, అవి చట్టప్రకారం శిక్షార్హమని ఈ ప్రకటన హెచ్చరిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

