Daggubati Heroes: ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబానికి చెందిన హీరోలు మరోసారి నాంపల్లి కోర్టుకు మరో సారి గైర్హాజరయ్యారు. దగ్గుబాటి హీరోలు కోర్టుకు రాకపోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. వారి తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేశారు. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోకుండా హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, అభిరామ్ లు తమ పరపతిని ఉపయోగించి 2022 నవంబర్, 2023 జనవరి నెలల్లో జీహెచ్ఎంసీ సిబ్బందితో హోటల్‌ను పూర్తిగా కూల్చివేయించారని ఆరోపించారు. హోటల్‌ను కూల్చివేసినప్పుడు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను కూడా అక్కడికి పంపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read also-SSMB29 story leak: టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ పూర్తవక ముందే లీకైన ‘SSMB29’ స్టోరీ.. సంబరాల్లో ఫ్యాన్స్
వ్యక్తిగత హాజరు తప్పనిసరి
ఈ కేసు విచారణలో భాగంగా, కోర్టుకు హాజరై వ్యక్తిగత బాండ్లను సమర్పించాలంటూ కోర్టు దగ్గుబాటి వెంకటేశ్, రాణా, సురేశ్ బాబు, అభిరాంలను ఆదేశించింది. అయితే, ఈ నలుగురు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు, వ్యక్తిగత బాండ్లను సమర్పించలేదు. గతంలో తమ న్యాయవాదుల ద్వారా బాండ్లను కోర్టుకు అందించాలని ప్రయత్నించగా, దాన్ని కోర్టు తిరస్కరించి, నలుగురు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నలుగురూ తప్పనిసరిగా కోర్టుకు వస్తారని అంతా భావించినప్పటికీ, ఈసారి కూడా హాజరు కాలేదు. వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, తమ క్లయింట్లు అత్యవసర పనుల్లో ఉన్నందున రాలేక పోయారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి కేసును డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున నలుగురు తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్ నందకుమార్, నిందితులు కోర్టుకు గైర్హాజరు కావడం ఇది నాలుగోసారి అని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. నలుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని అభ్యర్థించారు. అయితే, న్యాయమూర్తి ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు.
Read also-Pushpa 3: అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదే.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
న్యాయం జరిగే వరకు పోరాటం..
కేసు వాయిదా పడ్డ తరువాత పిటిషనర్ నందకుమార్ మాట్లాడుతూ, ఈ కేసులో తనకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిందితులుగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్, రాణా, సురేశ్ బాబు, అభిరాంలు హైకోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్నట్టుగా తనకు తెలిసిందన్నారు. కేసును విత్ డ్రా చేసుకోవాలని తనపై ఒత్తిడి కూడా తెస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ, న్యాయం జరిగే వరకు తాను పోరాటం సాగిస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.
