Boycott SVC Movies: బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మరణం తర్వాత ‘బాయ్‌కాట్’ ట్రెండ్ ఎలా నడిచిందో.. అక్కడి నిర్మాతలను ఎలా కుదేల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాంటి ఛాయలు టాలీవుడ్‌లో కూడా కనిపిస్తున్నాయి. అసలు విషయం తెలుసుకోకుండా.. మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ఊరుకునే రోజులు కావివి. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతున్న టెక్నాలజీలో ఉన్నప్పుడు.. చాలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడాలి. ఏ సంస్థ అయినా కొంతకాలం జర్నీ చేయాలనుకున్నప్పుడు.. ఓర్పు, సహనం కూడా ఉండాలి. అలా ఉన్నవారికే ఏ ఇండస్ట్రీ అయినా, మంచి రిటర్న్స్ ఇస్తుంది. అందుకు ఉదాహరణ నిర్మాత దిల్ రాజే (Dil Raju). తన సోదరుడితో కలిసి ఆయన సినిమా వ్యాపారం చేస్తున్నా.. ఎప్పుడూ తనే ఎక్కువగా మాట్లాడేవారు తప్పిదే.. శిరీష్ (Sirish)ని పెద్దగా మాట్లాడనిచ్చేవారు కాదు. శిరీష్‌ని మాట్లాడనిస్తే ఏం జరుగుతుందో.. ఇప్పుడు స్వయంగా దిల్ రాజు ఫేస్ చేస్తున్నారు.
Also Read- Dil Raju: శిరీష్ మాట్లాడింది తప్పే.. రామ్ చరణ్ వివాదంపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
రెండు రోజుల్లో తమ బ్యానర్ నుంచి సినిమా విడుదల ఉందనగా, లేనిపోని కాంట్రవర్సీలో చిక్కుకునేలా చేశారు నిర్మాత శిరీష్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌లో నితిన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘తమ్ముడు’. జూలై 4న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో, చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలలో ఒకరైన శిరీష్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇంతకు ముందు వారు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రస్తావన రాగా, ఆయన కంట్రోల్ తప్పారు. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాతో రిజల్ట్ ఎలా ఉన్నా, మేము ఎంత పోగొట్టుకున్నా.. కనీసం హీరో రామ్ చరణ్‌గానీ, డైరెక్టర్ శంకర్‌గానీ ఫోన్ కూడా చేసి మాట్లాడలేదని సంచలన ఆరోపణలు చేశారు. మరో వైపు దిల్ రాజు మాత్రం రామ్ చరణ్ (Ram Charan) ఎంతగానో కోపరేట్ చేశారని, దాదాపు 3 సంవత్సరాలు ఈ సినిమా కోసమే ఆయన కేటాయించారని చెబుతూ వస్తున్నారు. ‘తమ్ముడు’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి దిల్ రాజు చాలా పాజిటివ్‌గానే స్పందించారు. కానీ శిరీష్ ఒక్కసారిగా బరస్ట్ అవడంతో.. ఇండస్ట్రీలో ఇదో పెద్ద కాంట్రవర్సీగా మారింది.
Also Read- Actress Pakeezah: కన్నీళ్లు పెట్టిన పాకీజా.. స్వేచ్ఛ కథనంపై పవన్ కళ్యాణ్ స్పందన
బాలీవుడ్ తరహాలో.. మెగా ఫ్యాన్స్ ఈ నిర్మాణ సంస్థపై ఫైర్ అవుతున్నారు. ‘Boycott SVC Movies’ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వారలా చేయడానికి కారణం లేకపోలేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయంలో దర్శకుడిది ఎంత మిస్టేక్ ఉందో.. దానికి రెండింతలు నిర్మాతలది కూడా ఉంది. ఆ విషయం దిల్ రాజుని అడిగినా చెబుతారు. సినిమా పైరసీ బారిన పడినా.. నిర్మాణ సంస్థ నుంచి ఒక్కరూ నోరు మెదపలేదు. విడుదల తర్వాత ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. కనీస ప్రమోషన్స్ లేవు. సినిమాపై కావాలని కొందరు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటే.. దానిని తిప్పికొట్టలేకపోయారు. ఇంత తప్పు పెట్టుకుని.. ఇంకా రామ్ చరణ్ ఫోన్ చేయలేదని ఎలా అంటారు? ‘ఆర్ఆర్ఆర్’ వంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్ డేట్స్ ఇచ్చి.. దిల్ రాజు జడ్జిమెంట్ నమ్మి.. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోయారు. సంక్రాంతికి తన సినిమాకు పోటీగా మరో సినిమాను విడుదల చేసుకుంటామని.. ఇదే నిర్మాతలు అడిగితే, హ్యాపీగా రిలీజ్ చేసుకోమని అన్నారు. ఇంతకంటే, ఏ హీరో అయినా ఏం చేస్తాడు? తను కూడా ఓ నిర్మాతే కాబట్టి, నిర్మాతల కష్టాలు తెలుసు కాబట్టి.. మొదటి నుంచి సహకరిస్తూ వస్తే, కృతజ్ఞత చూపకపోగా, పైగా లేనిపోని మాటలు అనడం ఏంటి? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అందుకే ‘Boycott SVC Movies’ అంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు మెగాభిమానులు ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లెటర్ ఇదే..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు