Boyapati Sreenu: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో ‘అఖండ’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam). 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను మీడియాకు చిత్ర విశేషాలను తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా, ఒక వారం వాయిదా పడినందుకు ఎలా ఫీలయ్యారు? అనే ప్రశ్నకు బోయపాటి ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. అసలింతకీ బోయపాటి ఏమన్నారంటే..
ఊపిరి బిగబట్టుకొని మరీ చూస్తున్నారు
‘‘అఖండ 2.. విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువే. ఆ ఫీలింగ్ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదు. ఈ సినిమా ప్రజలకు చేరాలని తీశాం. మన తత్వం ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా మనల్ని చూసిన వెంటనే చేతులెత్తి దండం పెడతారు ఎందుకు? అంటే.. అది మనం ఆచరించే ధర్మం కోసం. మనం బిడ్డ పుట్టగానే పేగు తెంచి దేవుడికి ముడి వేస్తాం. దేవుడు పేరే పెట్టుకుంటాం. ఎదుగుతుంటే దేవుడు దయ అంటాం. చివరికి లోకాన్ని విడిచినప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడనే అంటాం. మనకి కష్టం వచ్చినా దేవుడే.. ఆనందం వచ్చినా దేవుడే. అలాంటి అంశాలతో ఒక గొప్ప దారిని ఎంచుకుని తీసిన సినిమానే ‘అఖండ 2: తాండవం’. ఇది ప్రతి ఒక్కరికి చేరాల్సిన సినిమా.. తప్పకుండా అందరికీ రీచ్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఈ సినిమా చాలా పవర్ ఫుల్‌గా, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాం. కొంతమంది ఆడియెన్స్‌ని గమనించాను.. కూర్చున్న సీట్లలో ఊపిరి బిగబట్టుకొని మరీ చూస్తున్నారు. మేము కూడా అలాంటి అనుభూతితోనే తీసిన సినిమా ఇది.
Also Read- Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!
కోపం రావడం సహజమే..
ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినప్పుడు అంతా రకరకాలుగా మాట్లాడారు. నేనూ మనిషినే. నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని అనివార్య కారణాలతో అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మా ఆలోచన అంతా బాలయ్య బాబు అభిమానుల గురించే. రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు.. కానీ, ఒక రెండు గంటలకు ముందు టికెట్లు చేతుల్లో పట్టుకుని థియేటర్స్ దగ్గరకు వెళ్లిన తర్వాత, వాయిదా అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది సహజం కూడా. ఆ క్షణం మా ఆలోచనలన్నీ అభిమానులపైనే ఉన్నాయి. అయితే వచ్చిన పరిస్థితి గురించి మేము భయపడలేదు. మాకు బాలయ్య బాబు ఉన్నారనే ధైర్యం ఉంది. ఆ సమయంలో ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత.. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి, సినిమా విడుదలకి ఏం కావాలో అవన్నీ చేశారు. ఆ తర్వాత అన్నీ కూడా సజావుగా జరిగిపోయాయి. సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.
Also Read- Chikiri Song: సునామీ సృష్టిస్తోన్న ‘చికిరి చికిరి’.. తెలుగులో సరికొత్త రికార్డ్!
చేతులెత్తి దండం పెట్టారు
నేను కొన్ని థియేటర్స్‌కి వెళ్లి చూశాను. ఆ ఆనందాన్ని నిజంగా మాటల్లో చెప్పలేను. ఒక మంచి సినిమా తీసి ఆశించాల్సింది డబ్బు కాదు గౌరవం. అలాంటి గౌరవం ఈ సినిమాతో వచ్చింది. సహజంగా థియేటర్స్ విజిట్‌కి వెళ్ళినప్పుడు అందరూ నిలబడి విజల్స్, క్లాప్స్ కొడతారు. కానీ ఈ సినిమాకి వెళ్ళినప్పుడు అందరూ లేచి, చేతులెత్తి దండం పెట్టారు. నేను కూడా ‘మీ అందరి స్పందన చూడడానికే వచ్చానని’ అందరికీ నమస్కరించి వచ్చాను. నిజంగా ఇది చాలా గొప్ప అనుభూతి. ఇదంతా మనలో మమేకమై ఉన్నది. మన ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి ఇందులో అద్భుతంగా చెప్పాం. మన ధర్మాన్ని మనం ఫాలో అయితే అద్భుతంగా ఉంటామని చూపించాం. థియేటర్స్‌లో చిన్న పిల్లలే నాకు ఎక్కువమంది కనిపించారు. వాళ్ల కేరింతలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది’’.. అని బోయపాటి తన సంతోషాన్ని తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

