AM Rathnam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. జూలై 24న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయనే విషయం తెలియంది కాదు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా కొనసాగిస్తున్నారు. జూలై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మీడియాకు తెలియజేశారు నిర్మాత ఎ.ఎం.రత్నం. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇటీవల కొందరు ఈ సినిమా కథ విషయంలో కాంట్రవర్సీ చేశారు. వారందరికీ మరోసారి చెబుతున్నాను.. ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథను అల్లుకోవడం జరిగింది. ‘హరి హర వీరమల్లు’ అని ఈ సినిమాకు పేరు పెట్టడానికి కారణం.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము అంతే. అంతకుమించి ఏం లేదు. నేను ‘భారతీయుడు’ సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. కానీ ఇప్పటి వరకు నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఏదంటే మాత్రం ‘హరి హర వీరమల్లు’ సినిమానే అని చెబుతాను. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇది పవర్ స్టార్ డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్‌తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఇంత ఆలస్యమైంది. చాలా సార్లు రిలీజ్ వాయిదా పడటంతో.. సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. సినిమా ట్రైలర్‌తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాలు 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతోనే చెప్తున్నాను.. ‘హరి హర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కచ్చితంగా బాక్సాఫీస్ షేకవుతుంది.
Also Read- Hari Hara Veera Mallu: వీరమల్లుకు సెన్సార్ షాక్.. ఆ వాయిస్ లేపేశారా?
ఈ సినిమాను మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది మొదటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. ఈ వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువ మందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చలు నడుస్తున్న క్రమంలో కథ స్పాన్ పెరిగింది. రెండు పార్ట్‌లుగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము అనుకున్నాం. కానీ అభిమానులు ముందు రోజు రాత్రి నుంచే షోలు (ప్రీమియర్స్) వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము..’’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు