– ఫామ్ ల్యాండ్ పేరుతో నీమ్స్ బోరో దందా
– స్కాం బయటపెట్టిన స్వేచ్ఛ-బిగ్ టీవీకి నోటీసులు
– రూ.5 కోట్లకు పరువు పోయిందంటున్న మురళీకృష్ణ
– మధ్యతరగతి కుటుంబాలను మోసం చేస్తున్నది నిజం కాదా?
– రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రజలను అలర్ట్ చేయొద్దంటారా?
– గ్రామాల్లో అమాయకులను బలి చేస్తున్న వ్యవహారాల సంగతేంటి?
– మార్కెంటింగ్ పేరుతో భూ వివాదాల్లోకి యువకుల్ని లాగుతున్నదెవరు?
– బ్యాంకు అకౌంట్స్ అంతా అమాయకుల పేరు మీద ఎందుకున్నాయి?
– నిజాలు చెబుతుంటే ఎందుకంత భయం?
– జీఎస్టీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగితే ఏం జరుగుతుంది?
– అక్రమాలకు కేరాఫ్‌గా నీమ్స్ బోరో పార్ట్ -2
-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం)
What they do are scams, and what they say is a notice if they violate ethics: ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా భూమిని డెవలప్మెంట్ లేదా కొనుగోలు చేసుకుని ఆ తర్వాత విక్రయిస్తుంది. కానీ, నీమ్స్ బోరో రూటే సప‘రేటు’. వందల ఎకరాల ఫామ్ ల్యాండ్ అంటూ ఉదరగొడుతుంది. కానీ, వారి పేరు మీద ఉన్న ల్యాండ్ ఎంతో బయటకు చెప్పదు. ఆ విషయం బయటకొస్తే స్కాం ఏంటో అర్ధమవుతుంది. వీళ్లు అమ్మే ఫామ్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంటుంది. డబ్బులు ఏవరికి చేరుతున్నాయో ఆరా తీస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. మియాపూర్‌లో 18 ఫ్లాట్స్‌లో వందల మంది యువతను గ్రామాల నుంచి తీసుకొచ్చి మార్కెటింగ్ పేరుతో భూ దందాలు చేయిస్తున్నారు. ఎలాంటి ఆదాయం లేని వారిపై భూములు కొనుగోలు చేసినట్లు చూపించి, వారి అకౌంట్స్‌కి డబ్బులు బదులాయించి, ఆ తర్వాత నీమ్స్ బోరో క్యాచ్ అవుట్ చేసుకుంటోంది. భవిష్యత్తులో భూ వివాదం తలెత్తితే తామెక్కడా లేమని చెప్పడానికి ఈ దందాను పక్కాగా అమలు చేస్తోంది నీమ్స్ బోరో. ఈ సంస్థ మోసాలను స్వేచ్ఛ-బిగ్ టీవీ బయటపెట్టగా, నోటీసులతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది.
ధరణి ప్రకారమే నడుచుకుంటున్నారట!
డిసెంబర్ 2023న నాగలగిద్ద తహసీల్దార్ కార్యాలయంలో రెండున్నర గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చింది నీమ్స్ బోరో. దుడ్డె బాల్ రాజ్ అనే 26 ఏండ్ల యువకుడు నీమ్స్ బోరో ఆఫీస్ అయిన ఆర్బీఆర్ కాంప్లెక్స్ 5వ అంతస్తు అడ్రస్‌తో అమ్మినట్లు చూపించారు. అతనికి ఆ ల్యాండ్ ఎక్కడ నుంచి వచ్చింది? ఇలా అక్సిరైజ్ పేరుతో 200 ఎకరాలు, హుడ్ ల్యాండ్ పేరుతో 300 ఎకరాలు, నేషర్ హుడ్ పేరుతో మరో 100 ఎకరాలు, సన్ షైన్ పేరుతో 150 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ అంటూ కర్ణాటక బార్డర్‌లో మొత్తం 800 ఎకరాల్లో లక్షకు గుంట భూమి అంటూ ఊదరగొడుతోంది. ఆశలు రేకెత్తించి పేద, మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతోంది. వందల ఎకరాలు అని చెప్పుకుంటూ, 2 నుంచి 5 ఎకరాలు కొనుగోలు చేసి, మార్కెటింగ్ యువకుల పేర్ల మీద పెడుతోంది. ముక్తాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 20లో 20/ఆ/1/1/1/1/1/1/1/1/1/1/1 తో రెండున్నర గుంటల భూమిని ఒక సైడ్ రోడ్డు అని ప్రకటించుకుంది నీమ్స్ బోరో. లీగల్‌గా అక్కడ ఎలాంటి రోడ్డు ఉండదు. ఉన్నా అది కొంత మంది ల్యాండ్ లార్డ్స్ పేరు మీదగానే ఉంది. దీంతో రోడ్డు ఏరియా అంతా వేరే వారి పేరు మీద ఉంది. వారికే వీళ్లు చెప్పే రైతు బంధు పెద్ద మొత్తంలో పడుతుంది. దీంతో భవిష్యత్‌లో లీగల్ ఇష్యూస్ రావా? ఎకరం 5 నుంచి 8 లక్షలు కూడా ఉండని భూమిని 40 లక్షలకు ఎకరం అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న నీమ్స్ బోరో నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తమ పరువుకు నష్టం వాటిల్లింది అంటూ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పెట్టిస్తామని నోటీసులు పంపి మీడియానే బెదిరిస్తోంది నీమ్స్ బోరో యాజమాన్యం. అంతేకాదు, 5 కోట్లు చెల్లించాలని అంటోంది. ఏదో టార్గెట్ చేసి వార్తలు రాయాల్సిన అవసరం స్వేచ్ఛ-బిగ్ టీవీకి లేదు. మీ అభిప్రాయంపైనా తప్పకుండా వార్తలు ఇస్తాం. మీరు ప్రజలను మోసం చేయడం లేదని రుజువు చేస్తే కస్టమర్సే పట్టం కడుతారు.
రియల్ మోసాలు బయటపెట్టడం తప్పెలా అవుతుంది
కరోనాకు ముందు నీమ్స్ బోరో ఓనర్ జీవీఎన్ మురళీ కృష్ణ ఆర్థిక పరిస్థితి, ఇప్పటి స్థితిగతులు ఎలా ఉన్నాయి. జీఎస్టీ, అదాయపు పన్ను ఎగ్గొట్టి, అమాయకుల పేరు మీద అకౌంట్స్ తీసుకుని చేస్తున్న దందాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేదా? సాహితీ నారాయణ, ఫార్చ్యూ 99, వీరి మార్కెటింగ్ భాగస్వామి అయిన చెక్క సుబ్రహ్మణం లాంటి వారు ఎన్నో మోసాలు చేసి, అమాయకుల డబ్బులను దోచుకొని అరెస్ట్ అయినా మళ్లీ బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రియల్ మోసాలపై ప్రజలను అలర్ట్ చేయడం స్వేచ్ఛ-బిగ్ టీవీ తప్పెలా అవుతుంది? మోసపోయిన తర్వాత ధర్నాలు, ప్రభుత్వం, పోలీసుల తీరును తప్పుబడితే నష్టం ఎవరికి? ఇలాంటి చీటర్స్ అందరూ తమ తప్పేం లేదని నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా?
గతంలోనూ గొడవలు
నీమ్స్ బోరో హుడ్ ల్యాండ్ భూములు అమ్మే సమయంలో ఓ కస్టమర్‌కి అనుమనం వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతన్ని నానా ఇబ్బందులకు గురిచేసి కేసు విత్ డ్రా చేయించారు. ఇలా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొంతమంది సంగారెడ్డి లీడర్స్‌తో చేతులు కలిపి రూ.500 కోట్ల దందా చేశారు. లిటిగేషన్ భూములను తక్కువ ధరకు తీసుకుని ప్రజలకు అంటగట్టారు. మళ్లీ అలాంటి భూ వివాదాలు రావని నీమ్స్ బోరో గ్యారెంటీ ఇస్తుందా? డబ్బులు సంపాదించుకుని రాష్ట్రం దాటి వెళ్లిపోతే ఎవరు బాధ్యులు?
మియాపూర్ దందాపై నెక్ట్స్ కథనం
మియాపూర్‌లోని ఆర్బీఆర్ కాంప్లెక్స్‌లో అక్రమంగా నీమ్స్ బోరో ఆఫీస్ నుంచి ఎంత మందికి అకౌంట్స్ ఉన్నాయి? భూములు ఎలా వస్తున్నాయి? ఆర్ధిక మోసాలకు బీజం ఎలా పడుతుంది? బాధితులు సంప్రదిస్తే ఇస్తున్న సమాధానం ఎలా ఉంటుందో మరో కథనంలో చూద్దాం.