- బుధవారం నుంచి స్కూలు బస్సుల తనిఖీలు ముమ్మరం
- ఫిట్ నెస్ లేని బస్సులపై కఠినచర్యలు
- స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్న రవాణా శాఖ అదికారులు
- తెలంగాణలో 23 వేల 824 స్కూలు బస్సులు
- 14 వేల 809 బస్సుల తనిఖీ పూర్తి
- బస్సుల వివరాలు నమోదు చేయని స్కూలు యాజమాన్యాలు
- బడి బస్సులు ఫిట్ నెస్ గా లేకుంటే స్కూలు లైసెన్స్ రద్దు
Telangana statewide special drive on school busses fitness:
గతంలో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకుని పాఠశాలల బస్సుల ఫిట్ నెస్ పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు రవాణా శాఖ అధికారులు రెడీ అవుతున్నారు. 12వ తేదీ నుంచి తనిఖీలు ముమ్మరం చేసి సరైన పత్రాలు లేని స్కూలు బస్సులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ కు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్, ఐదేళ్లు తప్పనిసరిగా అనుభవం ఉండాలి అని నిబంధనలు అమలుచేస్తున్నారు. ప్రభుత్వ జీవో 35 ప్రకారం స్కూల్ బస్సులు రిపేర్లు చేయించుకుని ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ సారి అలా సర్టిఫికెట్ పొందని వాహనాలతో పాటు సంబంధిత విద్యాసంస్థల గుర్తింపు కూడా రద్దవుతుందని రవాణాశాఖాధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 23 వేలకు పైగా బస్సులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు చెందిన స్కూల్ బస్సులు 23 వేల 824 ఉన్నాయి. ఇప్పటి దాకా 33 జిల్లాల పరిధిలో 14 వేల 809 బస్సులను తనిఖీ చేశారు. అందులో 157 బస్సులకు ఫిట్ నెస్ లేనందున అనుమతి నిరాకరించినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా కరీంనగర్ లో 41 బస్సులు, ఖమ్మంలో 30 బస్సులకు అనుమతి నిరాకరించారు. ఇంకా 9 వేల 15 బస్సులను తనిఖీ చేయాల్సివుంది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 5 వేల 732 స్కూలు బస్సులు ఉండగా మేడ్చల్ జిల్లాలో 5 వేల 609 బస్సులు, హైదరాబాద్ పరిధిలో 1,290, సంగారెడ్డిలో 1,222 స్కూలు బస్సులు ఉన్నాయి.
అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు
ప్రైవేటు పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు ఆర్టీఏ కార్యాలయంలో బస్సుల వివరాలు నమోదు చేయడం లేదని ఆరోపణలున్నాయి. గతంలో ప్రైవేటు బస్సులు కూడా పలుమార్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అధికారులు చేపట్టే తనిఖీల్లో అనధికారికంగా నడిపే బస్సుల వివరాలు తేలాయ ని తెలిపారు. తనిఖీల టైంలో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని, దీంతో సక్రమంగా డ్యూటీ చేయలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.