- విభేదించిన ఎవరినీ వదలని కేసీఆర్ సర్కారు
- విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులనూ వదలని వైనం
- ట్యాపింగ్ బాధితుల్లో సగం సొంత పార్టీ వారే
- ఎన్టీవీ, ఆంధ్రజ్యోతి ఎండీలూ బాధితులే
- రేవంత్ రెడ్డిపై ప్రత్యేక దృష్టి
- కాంగ్రెస్‌కు అండగా నిలిచిన వారందరూ బాధితులే
- రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన అంశాలు
- వెలుగులోకి తెచ్చిన స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం
దేవేందర్ రెడ్డి, 9848070809
Sensational phone tapping case cm reventh take serious victims names:
స్వేచ్ఛ – బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి. తెలంగాణ పోలీసుల ముసుగులో తన సామాజిక వర్గం వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించిన కేసీఆర్ చేసిన అనైతికమైన పనులన్నీ ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. పోలీసులే కీలక నిందితులైన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే కీలక ఆధారాలు రాబట్టింది. ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచుతోంది. అలాగే, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మేల్యేల కొనుగోలు వ్యవహారం వీడియోలు, అడియోలు ఏ దారిలో వచ్చాయనేది పోలీసుల విచారణలో ఇప్పుడు తేటతెల్లం అయింది. టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉంటూ వ్యక్తిగత అక్రమాలకు పాల్పడ్డ రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్‌లో క్లియర్‌గా దీనిని వివరించారు. 6 పేజీల కన్ఫెషన్ రిపోర్టులో 3వ పేజీలోని నాల్గో పేరా, 4వ పేజీలోని మొదటి పేరా మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పైనే ఉంది. తాజాగా ఈ కేసు విషయంలో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు తెలిసి జనం బిత్తరపోతున్నారు. ఈ క్రమంలో స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం వెలుగులోకి తెచ్చిన రాధాకిషన్ రావు వాంగ్మూలంలోని కొన్ని కీలక అంశాలు..
‘తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించి సిట్ ఇన్‌ఛార్జి ప్రభాకర్ రావు తరచూ నాతో మాట్లాడుతుండేవాడు. ఏదైనా నియోజక వర్గంలోని నాయకులు, వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి, అక్కడి ఎమ్మె్ల్యేలకు ఇబ్బందిగా ప్రమాదంగా మారుతున్నారని అనిపిస్తే, వెంటనే.. వారి వివరాలను ప్రణీత్ రావుకు పంపి, వారి ప్రొఫైల్ తయారుచేయించి, వారిపై నిరంతర నిఘా పెట్టాలని ఆదేశించేవాడు. తద్వారా వారి వ్యూహాలను కనిపెట్టి, వాటిని బీఆర్ఎస్ నేతలకు చేరవేసేవారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతల మీదా నిఘా పెట్టారు. కుత్బుల్లాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందతో విభేదాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరిని వ్యతిరేకించే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి. రాజయ్య మీద, అలాగే తాండూరు ఎమ్మెల్యే మీద అంసంతృప్తితో ఉన్న స్థానిక బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న ఆయన సతీమణి మీద కూడా నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న వాడుతున్న ఫోన్ సంభాషణలనూ సేకరించారు.
బీఆర్ఎస్‌కు గట్టిగా సవాలు విసురుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ల మీదా నిరంతర నిఘా కొనసాగింది. ఇక.. మీడియా రంగానికి చెందిన ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ సంభాషణలనూ ప్రణీత్ రావు బృందం రికార్డు చేసింది. విపక్షానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడైన రఘువీర్ రెడ్డి, గద్వాల నేత సరితా తిరపతయ్య, కోరుట్ల నేత జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేట నేత వంశీకృష్ణ, మానకొండూరు నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బృందంలోని సభ్యుల ఫోన్లనూ ఈ క్రమంలో ట్యాప్ చేయటం జరిగింది. సర్కారుతో విభేదించి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖ వ్యాపారుల ఫోన్లనూ ట్యాప్ చేసి ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనిస్తూ, వారు ఎవరితో మాట్లాడుతున్నారు? వంటి అంశాలను పరిశీలిస్తూ వచ్చాం.
ఈ క్రమంలో చాలామంది నాయకులు, అధికారులు, న్యాయవ్యవస్థ ప్రముఖుులు నేరుగా ఫోన్‌లో మాట్లాడటానికి భయపడి, వాట్సప్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడేవారు. దీంతో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్) మీద ఆధారపడి ఇంటర్ నెట్ కాల్స్ వినే ప్రయత్నమూ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, నాటి మంత్రి హరీష్ రావు ఆదేశం మేరకు ఐ న్యూస్‌కు చెందిన శ్రావణ్ కుమార్ నేరుగా ప్రభాకర్ రావుతో టచ్‌లోకి వెళ్లారు. దీంతో శ్రావణ్ కుమార్‌ను కలిసి, అతనితో కలసి పనిచేయాలంటూ, ప్రభాకర్ రావు.. ప్రణీత్ రావును ఆదేశించారు. దీంతో శ్రావణ్ కుమార్ ప్రణీత్ రావుతో సహా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలోని అధికారులతో నేరుగా మాట్లాడి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు దారుల సమాచారం, వారి రాజకీయ వ్యూహాలు, వారికి ఆర్థికంగా సాయపడే వ్యక్తుల వివరాలు సేకరించి, తమ పార్టీ అధినాయకత్వానికి చేరవేశారు. అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేస్తున్న వ్యక్తుల వివరాలను, వారి ఫోన్ సంభాషణలను సేకరించే ప్రయత్నమూ జరిగింది.