Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఏదో ఒక రూపంలో 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నది. 2008లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు. 2011లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీ ప్రధాన పార్టీల్లో ఒకటిగా ఎదిగింది.
అన్నయ్య చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన తమ్ముళ్లు పార్టీకి అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా పీఆర్పీలో కీలకంగా వ్యవహరించారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీకి నాగబాబు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలోనూ పాలుపంచుకుంటున్నారు. ఇక చిరంజీవి జనసేన పార్టీకి నేరుగా సహాయం చేయకున్నా.. పరోక్ష సహకారం అందిస్తున్నారు. జనసేన పార్టీకి బిగ్ బాస్ రూ. 5 కోట్ల విరాళం నిన్ననే అందించారు. దీంతో చిరంజీవి జనసేనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారనే చర్చ జరిగింది.
ఇంతలోనే కాంగ్రెస్ నాయకుడు గిడుగు రుద్రరాజు కీలకమైన వ్యాఖ్య చేశారు. చిరంజీవి జనసేనకు సపోర్ట్ చేయరని స్పష్టం చేశారు. తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్‌కు సహాయం చేసి ఉంటారని, కానీ, చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడే అని వెల్లడించారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని, ఇప్పటికీ ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారని స్పష్టం చేశారు.
Also Read: డాక్యుమెంట్లను ఎందుకు నాశనం చేశారు? స్కెచ్ అదేనా?
గిడుగు రుద్రరాజు వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. కానీ, చిరంజీవి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన నిజంగానే ఏ పార్టీతోనూ సంబంధంలో లేరనే అభిప్రాయాలు మెల్లగా ఏర్పడ్డాయి. ఇంతలో జనసేనకు విరాళం ఇవ్వడం, తమ్ముడి గురించి సాఫ్ట్‌గా మాట్లాడటం వంటివి ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నారనే అభిప్రాయాలు బలపడ్డాయి. కానీ, ఏపీలో జనసే, కాంగ్రెస్‌లు ప్రత్యర్థి పార్టీలే. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మిగిలిన అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలే. అందుకే గిడుగు రుద్రరాజు ఆ వ్యాఖ్యలు అనివార్యంగా చేయాల్సి వచ్చిందని అర్థం అవుతుంది. ఈ చర్చ ఒక వైపుంటే.. మన మెగా ఫ్యామిలీలో రెండు రాజకీయ పార్టీల నాయకులు ఉన్నట్టే కదా.. అనే ఎరుక మరోసారి అభిమానుల్లో వస్తున్నది.