Chandrababu Delhi Tour : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. పొత్తుల లెక్కలు తేల్చి.. అభ్యర్థులను ఎంపిక చేసేందుకై కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. అక్కడ బీజేపీ పెద్దలతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు విషయమై కీలక చర్చలు జరుపనున్నారు. ఈ భేటీతో టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భేటీ అనంతరం పొత్తులపై కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బుధవారం ఉదయమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే.
నేడు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో బుధవారమే పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు చంద్రబాబు. సుమారు గంటన్నర సమయం పాటు వీరిద్దరి భేటీ జరిగింది. బీజేపీతో పొత్తు విషయం, టీడీపీ-జనసేన మిగతా సీట్ల అభ్యర్థులు, బీజేపీకి సీట్లు కేటాయించే విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కుదిరితే ఎన్ని సీట్లివ్వాల్సి ఉంటుంది ? ఎక్కడెక్కడ బీజేపీకి స్థానాలు కేటాయించాలన్నదానిపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో తిరుపతి లేదా అమరావతిలో సభ నిర్వహించి మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు ఏపీ బీజేపీ నేతలను పొత్తు గురించి అడిగిన ప్రతీసారి హై కమాండ్ దే తుది నిర్ణయమని చెబుతూ వచ్చారు. తాము ఎలా పోటీ చేయాలన్నా.. సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా.. టీడీపీ-జనసేన కూటమి ఇప్పటికే 99 స్థానాలకు ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. అందులో టీడీపీ 94, జనసేన 5 స్థానాలకు అభ్యర్థుల్ని కేటాయించాయి. జనసేనకు మొత్తం 24 సీట్లివ్వగా.. మరో 19 స్థానాలకు రెండు, మూడ్రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు పొసిగితే.. మిగిలిన 118 స్థానాల్లో ఎన్ని బీజేపీకి కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ కంటే.. లోక్ సభ స్థానాలే ఎక్కువగా కేటాయిస్తారని అంటున్నారు విశ్లేషకులు.