Be Alert Vijayawada: కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలను నిఘా సంస్థలు అలెర్ట్ చేసిన సంగతి తెలిసిందే. రద్దీ ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయాలని కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. ఈ క్రమంలోనే విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సంబంధాలు ఉన్న ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు. మెుత్తం ఆరుగురు సిమి ఉగ్రవాదుల మూవ్ మెంట్స్ ను కనుగొన్నట్లు విజయవాడ స్థానిక పోలీసులు.. కేంద్ర నిఘా సంస్థకు తెలియజేశారు.
ఆ ప్రాంతాల్లో గుర్తింపు
విజయవాడలో ఇస్లామిక్ కార్యక్రమాలు తొలి నుంచి చురుగ్గా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సిమి ఉగ్రవాదులు నగరంలో తలదాచుకుంటున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు ముందే గుర్తించాయి. ఈ మేరకు విజయవాడ నిఘా వర్గాలకు సమాచారాన్ని చేరవేశాయి. ఈ మేరకు రంగంలోకి దిగిన విజయవాడ అధికారులు.. సిమికి చెందిన మెుత్తం ఆరుగురు కదలికలను తాజాగా గుర్తించినట్లు తెలుస్తోంది. స్థానిక నిఘా వర్గాల పరిశీలనలో నగరంలోని గొల్లపూడి, పంజా సెంటర్, లబ్బీపేట, అశోక్‌నగర్‌లలో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఒక్కొక్కరు ఒక్కో వృత్తి
వాస్తవానికి రెండు నెలల క్రితమే సిమి ఉగ్రవాదుల కదలికలను కేంద్ర నిఘా వ్యవస్థ విజయవాడలో గుర్తించింది. ఈ మేరకు నగర పోలీసులను అప్రమత్తం చేసింది. తాజాగా దాడుల నేపథ్యంలో మరింత అలర్ట్ అయిన పోలీసులు.. తీవ్ర పరిశోధించి వారిని గుర్తించారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో వృత్తిలో ఉన్నట్లు కనిపెట్టారు. ఒకరిద్దరు మసీదులో బిక్షాటన చేస్తుండగా.. మరో ఇద్దరు ఏసీ మెకానిక్ లుగా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో నలుగురు ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంతో ఇప్పుడు వారి సంఖ్య 10కి చేరినట్లు తెలుస్తోంది.
Also Read: Viral Video: వామ్మో.. కొండ చిలువతో యువతి అలాంటి పని.. వీడియో వైరల్
సీక్రెట్ ఆపరేషన్
అయితే సిమి ఉగ్రవాదుల కోసం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ చాలా సీక్రెట్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు ఎలాంటి అనుమానం రాకుండా వారిపై స్థానిక నిఘా వ్యవస్థ కన్ను వేసినట్లు తెలుస్తోంది. అయితే వారు పక్కాగా సిమీకి చెందిన ముష్కరులే అని చెప్పగలిగే స్ట్రాంగ్ ఎవిడెన్స్ నిఘా వ్యవస్థ వద్ద లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి వారిని అదుపులోకి తీసుకోకుండా వారి కదలికలపై ఓ కన్ను వేసి ఉంచారని తెలుస్తోంది. పరిస్థితులు ఏమాత్రం అనుమానకరంగా అనిపించిన వెంటనే వారిని అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.