Vemulawada MLA Adi Srinivas Slams on KCR
Politics

Adi Srinivas: బూడిద మీదా రాజకీయమా?

– గులాబీ నేతల మెప్పుకోసమే కౌశిక్ రెడ్డి ఆరోపణలు
– బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే
– త్వరలోనే కౌశిక్ అక్రమాలపై విచారణ
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్

హైదరాబాద్, స్వేచ్ఛ: లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన గులాబీ పార్టీ.. జనం దృష్టి మళ్లించేందుకు బూడిద పేరుతో రాజకీయం మొదలు పెట్టిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లోని మీడియా పాయింట్‌లో మరో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

కౌశిక్ రెడ్డీ.. బీ రెడీ
ఎన్టీపీసీ పనులు ప్రారంభించినప్పటి నుంచి రైతులకు బూడిదను ఉచితంగా ఇచ్చామని శ్రీనివాస్ గుర్తుచేశారు. బూడిద మీద రోజుకు రూ. 50 లక్షలు ఇక ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ, ఇదే నిజమైతే గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నేతలు దీనితో బాటు ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణాతో ఎంత సంపాదించారో లెక్క చెప్పాలని నిలదీశారు. తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన పొన్నం ప్రభాకర్‌ను గతంలో కేసీఆర్ ప్రశంసించారని శ్రీనివాస్ గుర్తుచేశారు. ఎన్టీపీసీ లారీలు ఓవర్ లోడ్‌తో వెళ్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని శ్రీనివాస్ సూచించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుగుతుందని, దానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలన్నారు. ఆరునూరైనా రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేసి తీరుతామన్నారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసాను జూన్, జూలైలో వేశారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ సన్నద్ధత చూశాక.. హరీష్ రావు​మాట మార్చి రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలంటూ కొత్త పాట పాడుతున్నారని మండిపడ్డారు.

దిగజారుడు ఆరోపణలొద్దు..
అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ…గతంలో బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని ప్రజలు గ్రహించారనీ, అందుకే కౌశిక్ రెడ్డి తమ ప్రభుత్వం మీద బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. భార్య పిల్లల పేరుతో రాజకీయాలు చేసే నీచస్థాయికి దిగజారిన కౌశిక్ గురించి మాట్లాడటం వృధా అనీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ తెర వెనుక ఉండి ఈ ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డి.. బహిరంగంగా పొన్నం ప్రభాకర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పంచభూతాలను గుప్పిట్లో పట్టినందుకే బీఆర్ఎస్ భూస్థాపితం అయిందని వివరించారు. 2022 నుండి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టెండర్ ద్వారా ఎన్‌టీపీసీ బూడిదను అమ్ముతోందనీ, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్మెంట్ ఉండదన్నారు. కొంతమంది రాజకీయ దయాదాక్షిణ్యాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు.