ఎస్సెల్బీసీ టన్నెల్‌లో
ముమ్మర సహాయ చర్యలు
రంగంలోకి నావికాదళం
ర్యాట్ హోల్ మైనర్స్, స్లీపర్ డాగ్స్, గరుడ బృందాలూ..
టన్నెల్‌కు మంత్రి కోమటిరెడ్డి, జానారెడ్డి
మహబూబ్ నగర్, స్వేచ్ఛ: పైకప్పు ఊడిపడి, ఎస్సెల్బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల జాడ కనిపెట్టేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ వారి ఆచూకీ తెలియడం లేదు. సోమవారం సాయంత్రం ఒక ఇంజినీర్ ఫోన్ రింగయినా.. లిఫ్ట్ చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దీంతో చిక్కకున్నవారి విషయంలో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఆశలు అడుగుంటుతున్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదెలా ఉన్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు, ఆర్మీ, నేవీ, సింగరేణి, జేపీ, నవయుగకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడుసార్లు సొరంగంలో తనిఖీలు నిర్వహించాయి. 584 మంది నిపుణులు బృందాలుగా ఏర్పడి సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన రెస్క్యూ టీం కూడా సహాయ చర్యల్లో నిమగ్నమైంది. వీరితోపాటు 14 మంది ర్యాట్ హోల్ మైనర్స్ సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మనుషుల జాడను కనిపెట్టే స్నిప్పర్ డాగ్స్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ప్రమాదస్థలిలో నీరు బురద ఉండటంతో అవి ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయాయి. సహాయ చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సోమవారం పర్యవేక్షించారు. పేరుకుపోయిన బురద, శిథిలాలను తొలగించేందుకు 100 హెచ్‌పీ కెపాసిటీ కలిగిన మోటర్లను ఉపయోగిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నీటి బురద తీవ్రత తగ్గిన తర్వాత సహాయ చర్యలు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు. తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకోవడానికి ప్రధాన అడ్డంకిగా మారిన టీబీఎం భాగాలను విడదీసేందుకు ఐదు గ్యాస్ కటింగ్ మిషన్లు రేయింబవళ్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. అనంతరం సాయంత్రం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాబిన్ టన్నెల్ కంపెనీ ప్రతినిధి గ్రేస్, ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధి, టన్నెల్ వర్క్‌లో దేశంలోనే ప్రసిద్ధి చెందిన క్రిస్ కూపర్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరుల్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న ప్రాజెక్టు మేనేజర్ మొబైల్ ఫోన్ ఈ సాయంకాలం వరకు రింగ్ అయిందని, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తున్నదని మంత్రి వెల్లడించారు. ప్రమాద స్థలికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ నేతలు దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఘటనా స్థలికి వస్తే సహాయ చర్యలకు ఆటంకం అవుతుందని ఉద్దేశంతోనే సీఎం రావడం లేదన్నారు. ఈ సాయంకాలం మూడు గంటల ప్రాంతంలో సహాయక బృందాలు సొరంగంలోకి వెళ్ళాయని వారంతా రేపు ఉదయానికల్లా బయటికి వస్తే, సహాయక చర్యల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు.
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: జానారెడ్డి
సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిష్ణాతులైన వారి సహకారాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నదని మాజీ మంత్రి జానారెడ్డి తెలిపారు. సహాయ కార్యక్రమాలు మూడు నాలుగు రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశముందన్నారు.
ర్యాట్ హోల్ మైనర్స్ కీలకం
సాధారణంగా బొగ్గు గనుల్లో ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో సన్నని సమాంతర మార్గాల ద్వారా రంథ్రాలను ఏర్పాటు చేసి, గనుల్లోకి వెళ్లి బొగ్గు వెలికి తీస్తారు. ఈ పద్ధతిలో తవ్విన మార్గాలు కేవలం నాలుగడుగుల వెడల్పు మాత్రమే ఉంటాయి ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే ఆ మార్గం ద్వారా వెళ్లగలుగుతారు. ఈ పద్ధతిలో ఇదే ప్రధానమైన సవాలు. ర్యాట్ హోల్ మైనర్స్ గతంలో ఉత్తరాఖండ్ కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.