ఎస్సెల్బీసీ టన్నెల్‌లో టెన్షన్ టెన్షన్
ఇంకా దొరకని 8 మంది ఆచూకీ
ఆందోళనలో కుటుంబ సభ్యులు
ముమ్మరంగా రెస్య్కూ ఆపరేషన్
టన్నెల్ లోపల బురదకూపంలా..
సహాయ చర్యలకు బోరింగ్ మిషన్ అడ్డు
అది దాటితేనే ఘటనా స్థలానికి మార్గం
250 మీటర్ల ఇవతలే సహాయ బృందాలు
దాటేందుకు శతవిధాలా ప్రయత్నాలు
అది ఫలిస్తేనే కార్మికుల జాడ తెలిసేది
ప్రతి నిమిషమూ అత్యవసరమే..
ఘటనాస్థలంలోనే మంత్రులు, అధికారులు
సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్
SLBC Tunnel Tragedy: మహబూబ్ నగర్, నల్లగొండ, స్వేచ్ఛ: ఎస్సెల్బీసీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు తెలంగాణ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) నుండి 250 మీటర్లు ముందుకు వెళితే సంఘటనా స్థలానికి సహాయ సిబ్బంది చేరుకుంటారు. ఈ 250 మీటర్ల గమ్యాన్ని అధిగమించడం అత్యంత క్లిష్టంగా మారింది. 14వ కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మీద 15 అడుగుల ఎత్తు వరకు బురద పేరుకుపోయి.. సహాయ చర్యలకు సవాళ్లు విసురుతున్నది. 14వ కిలోమీటర్‌కు ముందు బోరింగ్ మెషీన్ ధ్వంసమై ఉండటంతో దానిని దాటడం సహాయ సిబ్బందికి సవాలుగా పరిణమించింది. ప్రమాద స్థలికి అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను కట్ చేస్తేనే అవతలి వైపుకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. సొరంగ మార్గ ప్రయత్నం సఫలీకృతం కాని పక్షంలో కొండ ఉపరితలంపై నుండి నేరుగా సొరంగంలోని సంఘటన ప్రాంతానికి చేరుకోవడానికి 450 మీటర్ల రంధ్రాన్ని చేయడానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నారు.
శనివారం నుంచీ ఆపరేషన్ ఇలా..
ఎన్డీఆర్ఎఫ్ దళాల రంగ ప్రవేశంతో శనివారం రాత్రి 10 గంటల నుండి ఎస్సెల్బీసీ సొరంగంలో సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ చేరుకోవాల్సి ఉండగా 11.5 కిలోమీటర్ వరకే లోకో ట్రైన్ వెళ్లగలిగింది. ఆ తర్వాత రెండున్నర కిలోమీటర్లు భారీగా బురద ఉండటంతో సహాయ బృందాలు ముందుకెళ్ల లేకపోయాయి. కెనాల్ తవ్వకం సమయంలో మట్టిని బయటకు చేరే వేసే కన్వేయర్ బెల్ట్ సహాయంతో 13.75 కిలోమీటర్ల వరకు చేరుకోగలిగారు. సరిగ్గా అక్కడే టన్నెల్ బోరింగ్ మిషన్ ధ్వంసమై, సొరంగాన్ని పూర్తిగా బ్లాక్ చేసి కనిపించింది. టీబీఎం అవతలి వైపు కార్మికులు చిక్కుకొని ఉండగా వెళ్లడానికి ఎలాంటి మార్గం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ దళాలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. మళ్లీ శనివారం తెల్లవారుజామున అనగా తెల్లారితే ఆదివారం మూడు గంటలకు సహాయ చర్యలు పునఃప్రారంభమయ్యాయి. టీబీఎం దాకా వెళ్లిన సహాయ సిబ్బంది.. చిక్కుకుపోయిన వారి పేర్లను పిలుస్తూ, గట్టిగా శబ్దాలు చేసినప్పటికీ అవతలి వైపు నుండి ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. ఆదివారం ఉదయం ఆరు గంటలకే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, సింగరేణి బృందాలు సహాయ చర్యలకు ఉపక్రమించాయి.
రంగంలోకి ఆర్మీ
కార్మికులను రక్షించేందుకు ఇప్పటికే ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీం ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు. మరోవైపు ఎంతో కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్‌లో భారీగా బురద ఉండటం, శిథిలాలు ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఒక్కో నిమిషం గడుస్తున్న కొద్దీ బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరిగిపోతున్నది.
రెస్క్యూ టీమ్స్ విశ్వ ప్రయత్నాలు..
ఎస్సెల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యల్లో స్వయంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రెస్క్యూ టీంతోపాటు ఆయన కూడా టన్నెల్ లోపలికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఇంజినీరింగ్, సహాయ బృందాలకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. మధ్యాహ్నం 1 గంటకు సిబ్బందితోపాటు టన్నెల్‌లోకి వెళ్లిన మంత్రి.. ఆరు గంటలపాటు వారితోనే ఉండి.. బయటకు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్‌లో టన్నెల్‌లోకి జూపల్లి వెళ్లివచ్చారు.
ఆశలు సన్నగిల్లినట్టే.. : మంత్రి జూపల్లి
ఎస్సెల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకుపోయిన కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టన్నెల్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. లోపల ఎలాంటి శబ్దం లేదని చెప్పారు. టన్నెల్‌లోనికి వెళ్లివచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టన్నెల్ లోపల ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. 8 మంది కార్మికులు సజీవంగా ఉండే అవకాశం చాలా తక్కువ అన్నారు. నీటి తీవ్రత ధాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ కొట్టుకువచ్చిందని చెప్పారు. దాదాపు ప్రమాద స్థలం దగ్గరికి సహాయ బృందాలు చేరుకున్నాయని.. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. 100 మీటర్లలో దూరంలోనే సమస్య ఉందని.. నీరు, బురద ఎక్కువగా ఉందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. టన్నెల్‌లో 8 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ ఫోన్..
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఘటనపై ఆరా తీశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎంకు సూచించారు. దాదాపు 20 నిమిషాల పాటు అన్ని అప్‌డేట్‌లు తెలుసుకున్నారు. వార్త అందగానే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిన తీరు, మంత్రి ఉత్తమ్ రెడ్డిని సంఘటన స్థలానికి పంపించడం, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్ఆర్‌డీఎఫ్ రెస్క్యూ స్క్వాడ్‌లను మోహరించడం గురించి రేవంత్ వివరించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించడంతోపాటు లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాహుల్‌కు వివరించారు. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను రాహుల్ అభినందించారు. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని కోరారు.
అధికారులతో మంత్రులు, కలెక్టర్ సమీక్షలు
ఆదివారం 9 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సహాయ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం 10:30 గంటలకు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, సహాయ చర్యలను వేగవంతం చేసే దిశ వైపుగా తీసుకోవాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదయం 6 గంటలకు సొరంగంలోకి వెళ్లిన సహాయ బృందాలకు బురద వల్ల ఆటంకం కలిగింది. ఇదే సందర్భంలో విద్యుత్ ప్రసారంలో కూడా అంతరాయం ఏర్పడింది. 11:30 కు భారీ జనరేటర్ ను సొరంగంలోకి పంపి విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించారు. మధ్యాహ్నం 1:30 గంటలకు టన్నెల్ ఆపరేషన్లలో నిష్ణాతులైన ఉత్తరాఖండ్ బృందం ఎస్సెల్బీసీకి చేరుకొని సహాయ చర్యలను ప్రారంభించింది. టీబీఎం నుండి 250 మీటర్లు ముందుకు వెళితే సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ఈ 250 మీటర్ల గమ్యాన్ని అధిగమించడానికి అత్యంత క్లిష్టంగా మారింది. 14వ కిలోమీటర్ వద్ద 100 మీటర్ల మీద 15 అడుగుల ఎత్తు వరకు బురద పేరుకుపోయింది. అక్కడికి చేరుకోవడానికి వెదురు బొంగులతో చేసిన చెక్క బల్లలు, టైర్లు, ఫిషింగ్ బోట్లను సైతం సిద్ధం చేసుకున్నారు. ఓవైపు సంఘటన స్థలం వద్ద ఉన్న బురద నీటిని తొలగించేందుకు భారీ కెపాసిటీ కలిగిన మోటర్లను వాడుతున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వారంతా సురక్షితంగా బయటికి రావాలని శ్రీశైల మల్లికార్జునున్ని ప్రార్థిస్తున్నానన్నారు.
పరోక్ష బాధ్యడు కేసీఆర్: ఎమ్మెల్యే వంశీకృష్ణ
నల్గొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ భూతం నుండి విముక్తుల్ని చేసేందుకు 2005లో నాటి సీఎం వైయస్ చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఎస్సెల్బీసీ అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 28 కిలోమీటర్ల మేర సొరంగం త్రవ్వకం పనులు పూర్తి చేసిందని, కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో 5 కిలోమీటర్లు మాత్రమే తవ్వకం పనుల్ని చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వమే సొరంగం పనుల్ని పూర్తి చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుని ఉండేవి కావని అన్నారు. జరిగిన సంఘటనను ప్రభుత్వానికి ఆపాదించి బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెస్క్యూ ఆపరేషన్ కి హైడ్రా
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం రెస్క్యూ ఆపరేషన్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందం శనివారం రాత్రే తరలి వెళ్లినట్లు హైడ్రా ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అక్కడకు చేరుకున్న హైడ్రా కమిషనర్ తొలుత సంఘటన జరిగిన వివరాలను తెలుసుకున్న తర్వాత వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి, రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించినట్లు సమాచారం. ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఎన్టీఆర్ఎఫ్)లతో కలిసి మెయిన్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి 50 మీటర్ల దూరం వరకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఎప్పటికపుడు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు హైడ్రా తెలిపింది. కార్మికులు, ఇంజినీర్లు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు హైడ్రా పేర్కొంది. ఆదివారం రాత్రంతా జరిగే ఆపరేషన్ ను కమిషనర్ పర్యవేక్షించనున్నట్లు వెల్లడించింది.