SLBC Tunnel Tragedy: రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ఎస్ఎల్ బీసీ టన్నెల్ (SLBC Tunnel) వద్ద పరిస్థితిని పరిశీలించడానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అక్కడికి చేరుకున్నారు. ఆర్మీ అధికారులతో కలిసి మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) టన్నెల్ లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన 14వ కిలోమీటర్ వరకు వెళ్లి అక్కడ పరిస్థితిని జూపల్లి పర్యవేక్షించనున్నట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఎల్ బీసీ టన్నెల్ కు ఎడమ వైపున, కుడి వైపున డ్రిల్లింగ్ చేస్తే వచ్చే పరిణామాల పై ఆయన అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొరంగం లోపల నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లడానికి ప్రయత్నించారు.
మరోవైపు, ప్రమాదం చోటుచేసుకున్న 14వ కిలోమీటర్ పాయింట్ వద్ద భారీగా బురద నీరు, మట్టి చేరుకున్నట్లు తెలుస్తోంది. రెస్క్యూకి బురద ఆటంకంగా మారిందని అధికారులు చెప్తున్నారు. ఆర్మీ అధికారులు లోపలికి వెళ్లి పరిస్థితి అంచనా వేసిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్ా దోమలపెంట వద్ద ఎస్ఎల్ బీసీ ఎడమ వైపు సొరంగం పనులు జరుగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం షిష్ట్ లో భాగంగా కార్మికులు పనిచేస్తుండగా 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు కూలడంతో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో టన్నెల్ లో దాదాపు 40 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పటివరకు 32 మంది బయటకు రాగా ఎనిమిది మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆర్మీతో పాటు ఉత్తరాఖండ్ రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది.
మూడు హెలికాప్టర్లలో ప్రత్యేక బృందాలు
కాగా, తాజాగా టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు అక్కడికి మూడు హెలికాప్టర్లలో ఆర్మీ, ఢిఫెన్స్ టీంలు చేరుకున్నాయి. ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నాయి. రక్షణ చర్యల నిమిత్తం ఇవి ఆధునాత టెక్నాలజీని ఉపయోగించనున్నాయి.
రెస్క్యూ టీంతో కలిసి రెస్క్యూ టీం తో కలసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ట్రైన్లో లోపలికి వెళ్లారు. వారి వెంట హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా ఉన్నారు. ప్రమాద ఘటన స్థలానికి చేరుకోవడానికి గంటకు పైగా సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పడే బయటకు వచ్చిన మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి
SLBC Tunnel: ఆపరేషన్ టన్నెల్.. 8 మంది సేఫేనా?
ఇదీ పరీక్ష సమయం- మంత్రి జూపల్లి
ఎస్ఎల్బీసీ లో ప్రమాదం జరగడంలో మానవ తప్పిదం జరగలేదని, ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏం లేదని, ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక బృందాల ఆద్వర్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అడ్డంకులు అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి నెలకొందని వివరించారు.
ఇదీ పరీక్ష సమయమని, కానీ బీఆర్ఎస్, బీజేపీ తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. తాను, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇద్దరం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నామని, నిన్నటి నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని వివరించారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2007లో ప్రారంభమయ్యాయని, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 10 మీటర్ల సొరంగం పనులు కూడా చేయలేకపోయిందని, సాగునీటి ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి, వాటిని పూర్తి చేయలేదని మండిపడ్డారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమైందని, అనుకోకుండా ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు.