tribals
తెలంగాణ

Adilabad: అడవుల్లో ఆదివాసీ కేకలు

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోలాం అదివాసీ బిడ్డలు అడవులను నమ్ముకొని ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అడవుల్లో లభించే ఇప్పపువ్వు, మొర్రి పండ్లు, తునికి పండ్లు, బంకను సేకరిస్తారు. వాటిని అమ్ముకొని వచ్చిన ఆదాయంతో అదివాసీలు జీవనం సాగించే వారు. కాలక్రమేణా అడవులు అతరించిపోతున్నాయి.. కొన్ని ప్రాంతాలు మైదానాలుగా మారుతున్నాయి. దీంతో అడవులనే నమ్మకొని జీవనం కొనసాగిస్తున్న కోలాంల పరిస్థితి దిగజారిపోతున్నది. అడవుల్లో సేకరిద్దామంటే పండ్లు లేవు ఫలాలు లేవు. పోనీ అడవిలో లభించే వెదురు బొంగుతో తడకలు, గుల్లలు తయారు చేసి వాటిని అమ్ముకొని బతుకుదామంటే.. అడవుల్లో వెదురు చెట్లు కనుమరుగయ్యాయి. దీంతో తిందామంటే బుక్కెడు బువ్వ లేక పస్తులు ఉంటున్నామని కుమ్రంభీమ్ జిల్లా జైనూర్ జాడిగూడ కోలాం గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాగు దుఃఖమైంది

అడవులు అంతరించిపోయిన పోడు భూముల్లో సాగు చేద్దామంటే చివరికి దుఃఖమే మిగులుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేద్దామంటే నీరు లేక వర్షంపై ఆధారపడి పంటలు వేస్తున్నాం.. వాన దేవుడు కరుణిస్తే పంట చేతికి వస్తుంది.. లేదంటే పెట్టుబడి పెట్టిన పైసలు కూడా రావడం లేదని గూడెం పటేల్ సిడామ్ రామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని చెప్పారు. పంటలు పండకా.. ఏదైనా పనిచేద్దామంటే పని దొరకడం లేదని.. గూడెం వదిలి బయటకు వెళ్లి అడ్డా కూలీలుగా మారుతున్నారు గిరిజనులు. అడవులు దూరమైనా.. సర్కారు అండగా నిలుస్తుందని భావించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు.

వసతులు లేక ఇబ్బందులు

కోలాం గిరిజనులు నివసిస్తున్న గూడాల్లో కనీస వసతులు లేవు. రోడ్లు, నీళ్లు, పాఠశాలలు లేకపోవడంతో పిల్లల చదువులకు దూరమవుతున్నారు. దవాఖానలు లేకపోవడంతో గూడెంలో ఎవరైనా రోగాల బారిన పడితే దేవుడే దిక్కంటున్నారు. ఆస్పత్రికి వెళ్దామంటే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఉందని గిరిజన మహిళ లక్ష్మీబాయి తెలిపారు. అంబులెన్స్ రాకపోవడంతో డెలివరీ కోసం మహిళను ఎడ్లబండిపై జైనూర్ దవాఖానకు తరలించామని ఆమె వాపోయారు. గూడెంలో తాగునీరు లేదు. ఒక్క బోరు ఉంటే.. ఆ బోరు నుంచి వచ్చే నీటిని జాడిగూడ, ఇందిరా గూడ, షేక్ గూడ గిరిజనులు తాగుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

తినడానికి తిండిలేక, రోగం వస్తే మందులు అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని అత్రం ‌లక్ష్మణ్ రావు అందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు అన్ని కోలాం గూడాల్లో ఉన్నాయన్నారు. కోలాం గిరిజనులు అంతరించే ప్రమాదంలో ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తడక గుడిసెల్లో నివాసం ఉంటున్నాం. వానకాలంలో వర్షం వస్తే ఇంట్లోకి వరద నీరొస్తుంది. ఎండకాలంలో ఎండలకు మండుతున్నాం. ఈ ఇబ్బందులు తొలగించడానికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని కోలాం గిరిజనులు కోరుతున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?