- ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ఘోర ప్రమాదం
- మూడు మీటర్ల మేర ఊడిపడిన పైకప్పు
- ఎనిమిది మంది కార్మికులు గల్లంతు
- సురక్షితంగా 32 మంది బయటకు
- వారిలో పదిమందికి గాయాలు
- గల్లంతైనవారికోసం రెస్క్యూ ఆపరేషన్
- రంగంలోకి ఆర్మీ, ఉత్తరాఖండ్ రెస్క్యూ టీమ్
- ప్రమాద స్థలిలోనే మంత్రులు ఉత్తమ్, జూపల్లి
- నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్
- ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ఫోన్
SLBC Tunnel: ఉరుములేని పిడుగులా ఊహించని ఉత్పాతం ఎస్సెల్బీసీ కార్మికులపై పంజా విసిరింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌లో శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం ఈ ఘటన చోటు చేసుకున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సంభవించిన ఈ ప్రమాదంలో సొరంగం లోపల 8 మంది చిక్కుబడిపోయారు. వారెలా ఉన్నదీ తెలియడం లేదు. మరో 32 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో పది మందికి గాయాలవడంతో దవాఖానలకు తరలించి, చికిత్సనందిస్తున్నారు.
దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించి, 6 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ ఎక్కడా లేనివిధంగా సొరంగ మార్గం పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో ఐదేండ్ల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులను తెలంగాణ సర్కార్ 4 రోజుల క్రితమే మొదలుపెట్టింది. శనివారం ఉదయం 8 గంటలు దాటిన తర్వాత పనుల నిమిత్తం 40 మంది కార్మికులు లోపలికి వెళ్లారు. కాసేపటికే సొరంగంలో జరిగిన అసహజ భౌగోళిక మార్పులతో ఒక్కసారిగా పై పెచ్చులు ఊడటం మొదలైంది. అంతకుముందే సొరంగంలోకి నీళ్లు రావడంతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది. కొన్ని క్షణాల్లోనే భారీ శబ్దం రావడం గమనించిన కార్మికులు ప్రాణ భయంతో బయటికి పరుగులు పెట్టారు. అదే సమయంలో పై భాగపు సిమెంట్ సెగ్మెంట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం అలముకున్నది. సొరంగం బయటివైపు ఉన్న32 మంది సురక్షితంగా వెలుపలికి వచ్చేసినా, బాగా లోపలికి వెళ్లిన 8 మంది మాత్రం అక్కడే చిక్కుకుపోయారని తెలుస్తున్నది. వీరిలో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రాణాలతో బయటకు వచ్చినవారిలో పది మందికి గాయాలవడంతో వారిని చికిత్స నిమిత్తం హాస్పిటళ్లకు తరలించారు. మిగిలిన ఎనిమిది మంది కోసం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ లోపల చిక్కుకుపోయిన వారిని సేఫ్‌గా బయటికి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బోరింగ్ మిషన్ ఆన్ చేశారకే ప్రమాదం: మంత్రి ఉత్తమ్
దోమలపెంటలోని జేపీ గెస్ట్‌హౌస్‌లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్యదాస్ నాధ్, ఐజీ సత్యనారాయణ, అగ్నిమాపక డీజీ జీవీ నారాయణరావు, జేపీ సంస్థ ప్రతినిధులుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లి.. 8.30 గంటలకు టన్నెల్ బోరింగ్ మిషన్ ఆన్ చేశారని తెలిపారు. బోరింగ్ మిషన్ ఆన్ చేశాకే ప్రమాదం జరిగిందని చెప్పారు. టన్నెల్‌లో ఒకవైపు నుంచి నీరు లీక్ అయ్యి మట్టి కుంగిందని.. దీంతో అధికారులు ముందే అప్రమత్తమై కొందరు కార్మికులను బయటకు పంపించారని తెలిపారు. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసి గట్టారని చెప్పారు. ఘటనకు కొన్ని క్షణాలకు ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారని మంత్రి వెల్లడించారు. బోల్ట్స్ ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్స్ కిందపడిపోయాయన్నారు. ఈ ఘటనతో విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి, మొత్తం చీకటి అలుముకుందని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయని.. ఆర్మీతో కూడా మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. రాత్రి వరకు సంఘటనా స్థలికి భారత సైన్యం రెస్క్యూ టీంలు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. టన్నెల్ ప్రమాద నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇటీవల ఉత్తరఖండ్‌లో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు పాల్గొన్న రెస్క్యూ టీంను ఇక్కడికి రప్పిస్తున్నామని తెలిపారు. టన్నెల్‌లో చిక్కుకున్నవారిలో జార్ఖండ్, యూపీ వాసులు ఉన్నారని పేర్కొన్నారు. టన్నెల్ 14 కిలో మీటర్ల లోపల ఉన్నందున సహాయ చర్యలు సవాల్‌గా మారాయని మంత్రి చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
ఎస్సెల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు. సహాయ చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌ను పంపిస్తామని సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీనిచ్చారు.
టన్నెల్‌లో చిక్కుకుపోయింది వీరే
1.మనోజ్ కుమార్, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఉన్నావ్, ఉత్తరప్రదేశ్)
2. శ్రీనివాస్, సైట్ ఇంజినీర్(చందౌలి, ఉత్తరప్రదేశ్)
3. సందీప్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్)
4. జగ్తా జెస్, కార్మికుడు (ఝార్ఖండ్)
5. సంతోష్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్)
6. అనూజ్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్)
7. సన్నీ సింగ్, జనరల్ ఆపరేటర్ (జమ్మూ కశ్మీర్)
8. గురుప్రీత్ సింగ్, ఎరక్టర్ ఆపరేటర్ (పంజాబ్)