- సమస్యల పరిష్కారానికి ఆందోళనల బాట
- ప్రజాక్షేత్రమే ఆమెకు పొలిటికల్ రోడ్ మ్యాప్
- రాజకీయంగా సమదూరంలో బీజేపీ, కాంగ్రెస్
- రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల విస్తృత పర్యటనలు
- ‘పార్టీలో ఆధిపత్య పోరు’ కామెంట్లపై సైలెంట్
- ‘జాగృతి’కి తోడు పార్టీ యాక్టివిటీస్ కూడా
- వ్యక్తిగత విమర్శల బదులు పాలసీలపై పోరు
- బీసీ ఎజెండాతో పాటు మహిళా అంశం సైతం
MLC Kavitha: ఓడినా గెలిచినా పొలిటికల్ లీడర్‌గా జనం మధ్యలో ఉండాలనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయించుకున్నారు. కష్టమైనా.. నష్టమైనా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని, అదే పొలిటికల్‌గా సరైన విధానమని ఆమె బలంగా అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఆమెను దూరం పెట్టింది… తగిన అవకాశాలు ఇవ్వడంలేదు.. సమావేశాలకు ఆహ్వానించడంలేదు.. గతంలో ఉన్న ప్రయారిటీ ఇప్పుడు లేదు.. ఇలాంటి ఎన్ని కామెంట్లు వచ్చినా ఆమె వాటిపై రియాక్ట్ కావడంలేదు. ఓపెన్ కామెంట్స్ చేయడంలేదు. గతంలో నిజామాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఆ జిల్లా ఎమ్మెల్సీగా దాదాపు పదేండ్ల పాటు ఆ ఎంపీ సెగ్మెంట్, జిల్లాకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ లైన్‌తో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి, ఫూలే యునైటెడ్ ఫ్రంట్.. లాంటి ఫోరమ్‌ల ద్వారా యాక్టివిటీస్ చేపట్టారు.
ఆందోళనలు, పోరాటాలతోనే రోడ్ మ్యాప్
ప్రజా సమస్యలను టేకప్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, పరిష్కారం కోసం వారి తరఫున కొట్లాడే మార్గాన్ని ఆమె ఎంచుకున్నారు. పార్టీలో కేటీఆర్, హరీశ్‌రావులతో పోలిస్తే ఆమెకు తగిన ప్రాధాన్యం లేదన్న మాటలు వినిపిస్తున్నా వాటిని ఆమె డోన్ట్‌కేర్… అనే తీరులోనే లైట్‌గా తీసుకున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఒక పొలిటీషియన్‌గా తనను దూరం పెట్టిన వ్యక్తులే భవిష్యత్తులో తన సత్తాను, శక్తిని గ్రహించి దగ్గరకు చేర్చుకునేలా తానేంటో నిరూపించుకోవాలన్న కసితో ప్రజలే కేంద్రంగా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నారని చెబుతున్నారు. ఎవరేమనుకున్నా జనంలోనే ఉండాలి.. వారి మన్ననలను పొందాలి.. నేడు విమర్శించినవారే రేపు ప్రశంసించాలి.. ప్రజలు వెన్నంటి ఉన్నంత వరకు ఎవరూ దూరం చేయలేరు.. ఇలాంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఎంతగా దూరం పెట్టినా సహనం, సంయమనంతోనే ఉండటం ఆమె ఎంచుకున్న వ్యూహమని పేర్కొంటున్నాయి.
ఒకప్పుడు కలవాడానికీ సాహసించని నేతలు
బీఆర్ఎస్ నేతలు ఆమెతో మాట్లాడడానికి, కలవడానికి కూడా దాదాపు ఏడాదిన్నరకు పైగా సాహసించలేదు. పార్టీ మౌఖిక ఆదేశాలున్నాయేమోనని ఆమె అనుచరులు ఆవేదనను వ్యక్తం చేశారు. కానీ సమయం వచ్చినప్పుడు వారే దగ్గర చేసుకుంటారనే భరోసాను అనుచరులకు నూరిపోసిన ఆమె దాదాపు నాలుగు నెలలుగా జిల్లాల్లో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. బీసీ ఎజెండాతో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, పసుపు బోర్డు, కల్యాణలక్ష్మి, తులం బంగారం కానుక, బతుకమ్మ చీరలు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు తదితర అంశాలతో విధానపరంగానే కాంగ్రెస్, బీజేపీలను కవిత టార్గెట్ చేశారు. ఆ అంశాలతో ప్రజలతో నిర్వహిస్తున్న ఆందోళనల్లో అనివార్యంగా స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నేతలు కూడా పాలుపంచుకోక తప్పలేదు. ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ ప్రోగ్రామ్‌లకు హాజరుకాక తప్పలేదని ఆమె సన్నిహిత వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
కేసీఆర్ మాటలతో క్లారిటీ
తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పేర్లతో ఆమె సొంతంగా నిర్వహించే కార్యక్రమాలకు తండ్రి కేసీఆర్ ప్రోద్బలం ఉన్నదనే మాటలూ వినిపించాయి. తెలంగాణ భవన్‌లో జరిగే అనేక కార్యక్రమాలకు ఆమెకు ఇన్విటేషనే లేదని, చివరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలోని తప్పులను ఎండగట్టడానికి పార్టీ నిర్వహించిన బీసీ నేతల (ఎమ్మెల్యేల) సమావేశానికి కూడా ఆహ్వానం లేదని ఆమె అనుచరులు గుర్తుచేశారు. అయినా ఆమె బీసీ ఎజెండాను పక్కన పెట్టలేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ జాగృతి తన యాక్టివిటీస్ తాను చేస్తుంది.. అంటూ కేసీఆర్ మాట్లాడడంతో ఆ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, ఆగవని, పార్టీ ప్రోగ్రామ్‌లతో సంబంధం లేదని పార్టీ శ్రేణులకు మెసేజ్ ఇచ్చినట్లయిందన్న అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
బీసీ ఎజెండాతో మొదలైన ప్రయాణం
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచీ పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో దూరంగా ఉంచారనే చర్చ చాలాకాలంగా ఉన్నది. కులగణనపై బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించినప్పుడే ఆమె ఎక్కడా బైటపడకుండా బీసీ ఎజెండాను సిద్ధం చేసుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. లిక్కర్ కేసులో అరెస్టు కావడానికి ముందే యునైటెడ్ ఫూలే ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు బీసీ సంఘాలతో సమావేశమై ఒక గ్రౌండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతిని బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇందిరాపార్కు దగ్గర భారీ స్థాయిలో నిర్వహించారు. ఏడాది కాలంలో దాదాపు 80 బీసీ కులాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా కులాల వెనకబాటుతనం గురించి చర్చించారు. కులగణనపైన బీఆర్ఎస్ నేతలుగా కేటీఆర్, మరికొందరు ఎలాంటి విమర్శలు చేసినా కవిత మాత్రం భిన్నమైన శైలిలో డిక్లరేషన్ హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
బీజేపీపైనా ఘాటు విమర్శలే!
బీజేపీతో కుమ్మక్కయినందునే లిక్కర్ కేసులో ఆమెకు బెయిల్ వచ్చిందని పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీని కవిత ఘాటుగానే విమర్శిస్తుండటం గమనార్హం. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీలను సమదూరంలోనే పెట్టారు. కొందరు గులాబీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తున్నా కవిత మాత్రం రాజకీయంగా, విధానపరంగానే విమర్శిస్తుండటం విశేషం. హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేస్తున్న యాక్టివిటీసే రానున్న రోజుల్లో ఆమెకు పార్టీలో మళ్ళీ ప్రయారిటీ వచ్చేలా చేస్తాయా? ఇంతకాలం దూరం పెట్టిన నేతలు ఆ వైఖరిని మార్చుకుంటారా? పార్టీ ఎలాంటి లైన్ తీసుకున్నా ప్రజాందోళనల విషయంలో మాత్రం కవిత తాను అనుకున్నదే చేస్తారా? ఇలాంటి సందేహాలన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది కాబోలు!