Kcr : మేడిగడ్డ కుంగుబాటుపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు (Harish Rao)లపై రాజలింగమూర్తి కేసులు వేసిన సంగతి తెలిసిందే. భూపాలపల్లి సెషన్స్ కోర్టులో రాజలింగమూర్తి పిటిషన్ వేయగా.. ఆయన పిటిషన్ ను స్వీకరిస్తూ నోటీసులు ఇచ్చింది కోర్టు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. జిల్లా కోర్టుకు విచారనార్హత లేకున్నా నోటీసులు జారీ చేశారని కేసీఆర్, హరీష్ రావు తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోరారు.
పిటిషన్ వేసిన రాజలింగమూర్తి మృతిచెందాడని కేసీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ చనిపోయాడు కాబట్టి విచారణ ఎలా చేస్తారంటూ ప్రశ్నించాడు. ఆ విషయం తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని న్యాయమూర్తి చెప్పగా.. పిటిషనర్ లేకపోయినా విచారణ కొనసాగించవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులో (High Court) పిటిషనర్ చనిపోయినా సరే విచారణ కొనసాగించిన కేసులు ఉన్నాయని వివరించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
ఇంకోపక్క రాజలింగమూర్తి కేసు తీవ్ర వివాదం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై రాజలింగమూర్తి భార్య ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో విచారణకు తాను సిద్ధమే అని వెంకటరమణారెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతోంది.