తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాజలింగమూర్తి హత్యపై రాష్ట్ర ప్రభుత్వం లోతైనా విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి ప్రాణం తీయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. మృతిడి భార్య చేస్తున్న ఆరోపణలపై లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎంక్వైరీ పూర్తి కాకముందే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కరెక్ట్ కాదన్నారు.
కాళేశ్వరం కేసు, ఫామ్‌హౌస్, డ్రగ్స్ కేసు, ఈ కార్ రేసింగ్ కేసులపై కాంగ్రెస్.. ఇదిగో అరెస్ట్.. అదిగో అరెస్ట్ అంటూ చెప్పింది తప్పితే.. కల్వకుంట్ల కుటుంబానికి చెందిన ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని సంజయ్ విమర్శించారు. అరెస్టులు చేస్తామని చెప్పి తీరా ఢిల్లీలో కాంప్రమైజ్ అయ్యారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అందుకు నిదర్శనమే ఈ ఘటనలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో గురువారం నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఉండాలంటే బీజేపీ రావొద్దని బీఆర్ఎస్, కాంగ్రెస్ భావించి ఒక్కటయ్యాయని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టలేదన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించినా కాంగ్రెస్, బీఆర్ఎస్ దాన్ని గుర్తించకుండా విమర్శలు చేస్తున్నాయని బండి ఫైరయ్యారు. కేంద్రం.. తెలంగాణకు ఏమిచ్చిందనే అంశంపై తాను, కిషన్ రెడ్డి.. చర్చలకు రావాలని కాంగ్రెస్‌కు గతంలోనే సవాల్ చేశామని, కానీ వారు ముందుకు రాలేదని తెలిపారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెప్పింది బీజేపీయేనని ఆయన తెలిపారు. అపెక్స్ కమిటీ మీటింగ్‌కు కారణం బీజేపీయేనన్నారు. అప్పుడు తమకు సమాధానాలు చెప్పకుండా అప్పటి సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. ఆంధ్ర నాయకులతో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణకు రావాల్సిన 575 టీఎంసీల జలాలకు బదులు 299 టీఎంసీలకు ఒకే అని ఎలా సంతకం పెట్టారని బండి సంజయ్ ప్రశ్నించారు. నీళ్ల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసిన మొదటి వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సెల్బీసీ ప్రాజెక్టు కట్టకుండా జాప్యం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని విమర్శలుచేశారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని నొక్కిచెప్పారు.