తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ :
సామాజిక కార్యకర్త రాజలింగ మూర్తిని (Rajalingamurthy) మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి (Gandra Venkata Ramana Reddy) హత్య చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఆరోపించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండించాల్సిందేనని వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందన్నారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేయడం బాధ కలిగించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌తో పాటు ఐదుగురిపై సామాజికకార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశారన్నారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్‌కు శిక్ష పడుతుందనే హత్య చేశారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెప్తున్నారని మంత్రి వివరించారు. ఇక గతంలో అడ్వకేట్ వామన్ రావ్ దంపతుల హత్యకు కారణం ఎవరో? అందరికీ తెలుసునని వివరించారు. వరంగల్‌లో ఎంపీడీవోను బీఆర్‌ఎస్ నేతలు హత్యచేశారని అప్పటి సీపీ రంగానాథ్ చెప్పారని గుర్తు చేశారు. మరోవైపు కొడంగల్‌లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌పై కూడా సురేశ్ అనే రౌడీ షీటర్ దాడి చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగవద్దని బీఆర్‌ఎస్ కుట్రకు పాల్పడుతున్నదన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నదన్నారు. కేసీఆర్‌కు కిరాయి హత్యలు చేయించడం మొదట్నుంచి అలవాటేనని ఆరోపించారు. సీబీఐ, సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్ష చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ హత్యను సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. లగచర్లలో కలెక్టర్‌ను చంపాలని చూశారని పేర్కొన్నారు. అవినీతిపై పోరాటం చేస్తే హత్యలు చేస్తారా? అంటూ మండిపడ్డారు. సిద్ధిపేట్‌లో హరీశ్ రావు అవినీతిపై పోరాడుతున్న చక్రధర్‌కు కూడా రక్షణ కల్పిస్తామని చెప్పారు. పదేళ్ల పాటు దోచుకొని తిని, ఎదురు తిరిగిన వాళ్లను చంపేస్తారా? అంటూ నిలదీశారు.
కేసీఆర్, హరీశ్‌లను ఉరి తీసినా తప్పు లేదు..
కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్, హరీశ్‌రావులను ఉరి తీసినా తప్పు లేదని మంత్రి వివరించారు. సచివాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌లు పోయాయన్నారు. 36 సీట్లలో బీఆర్‌ఎస్‌కు మూడు సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం, దక్షిణ తెలంగాణ పాపం శాపం బీఆర్‌ఎస్‌కు దగిలిందన్నారు. 20 నెలల్లోనే ఎల్‌ఎల్ బీసీ పూర్తి చేసి నీళ్లు పారిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ డ్రామాలకు ఎవరూ భయపడరని క్లారిటీ ఇచ్చారు.