హత్యకు కారణాలేంటి?
మేడిగడ్డ ఇష్యూతో లింకున్నదా?
విచారణకు ముందు రోజే జరగడంలో కుట్రేంటి?
భూ వివాదాలా?.. రాజకీయ ప్రేరేపితమైనదా?
పకడ్బందీ ప్లాన్‌తో కిరాయి హంతకుల పనేనా?
ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఆరాతీసిన సీఎంఓ
సమగ్ర దర్యాప్తు కోసం సీబీసీఐడీకి అప్పగింత?
మాజీ ఎమ్మెల్యే హస్తముందన్న మృతుడి భార్య
తెలంగాణ బ్యూరో, వరంగల్, స్వేచ్ఛ: రాజలింగమూర్తి (Rajalingamurthy) హత్య (Murder) రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ హత్యలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణారెడ్డి (Gandra Venkata Ramana Reddy) హస్తం ఉందని మృతుడి భార్య సరళ ఆరోపించడంతో బీఆర్ఎస్ (BRS) డిఫెన్స్ లో పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం (TG Govt) కూడా ఈ హత్యను సీరియస్‌గా తీసుకున్నది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సీఎంవో వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సీబీసీఐడీతో (CB CID) విచారణ జరిపించాలని కాంగ్రెస్, బీజేపీ సైతం డిమాండ్ చేశాయి. దీంతో ఈ కేసు ఏ మలుపు తిరగబోతున్నది? దోషులుగా ఎవరు తేలబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి ఎస్పీ ఆఫీసుకు కూతవేటు దూరంలో సోషల్ యాక్టివిస్టు రాజలింగమూర్తిని కత్తులు, గొడ్డళ్ళతో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించింది. ఈ హత్య వెనక ఎంతటివారున్నా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై రాజలింగమూర్తి న్యాయస్థానాలను ఆశ్రయించిన నేపథ్యంలో ఈ హత్య జరగడం అనేక అనుమానాలకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మనుషులే తన భర్తను చంపారంటూ మృతుడి భార్య ఆరోపించింది. భూవివాదాల కారణంగానే ఈ హత్య జరిగిందంటూ స్వయంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సీఎం కార్యాలయం ఆరా తీయడం గమనార్హం.
అసలు కారణం ఏమిటి?
ఈ హత్యకు భూ వివాదాలు కారణమా?.. లేక మేడిగడ్డ బ్యారేజీపై పిటిషన్ రాజలింగమూర్తి లీగల్ ఫైట్ చేయడం కారణమా?.. రాజకీయ ప్రేరేపితమైనదా?.. హైకోర్టులో కేసు విచారణ జరగడానికి కొన్ని గంటల ముందే రాజలింగమూర్తి హత్యకు గురికావడానికి ఏమైనా సంబంధం ఉన్నదా?.. కిరాయి హంతకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా?.. ఇలాంటి అనేక రకాల చర్చలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. వాస్తవాలను వెలికి తీయడానికి సీబీసీఐడీ దర్యాప్తును కోరుతామని, ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం కార్యాలయం కూడా ఈ హత్యకు దారితీసిన కారణాలపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నది. వీటన్నింటి నేపథ్యంలో ఈ హత్య ఘటన ఏ మలుపు తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.
మేడిగడ్డపై పిటిషన్ వ్యవహారమే కారణమా?
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై స్థానిక పోలీసు స్టేషన్ మొదలు హైకోర్టు వరకు పలు ఫిర్యాదులు, పిటిషన్లపై దర్యాప్తు, విచారణ వివిధ స్టేజీల్లో ఉన్నాయి. రాజలింగమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జిల్లా కోర్టులో గతంలో విచారణ జరగ్గా కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ అయ్యాయి. వీటిని సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. జిల్లా కోర్టుకు సమన్లు ఇచ్చే అధికారమే లేదని, ఆ నోటీసుల్ని కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో కేసీఆర్, హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. దీనిపై గురువారం విచారణ జరగాల్సి ఉన్నది. ఇంతలోనే రాజలింగమూర్తి హత్యకు గురికావడం సంచలనమైంది. షెడ్యూలు ప్రకారం గురువారం విచారణకు రావాల్సి ఉన్నా రాలేదు.
సీబీ సీఐడీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై రాజలింగమూర్తి కొట్లాడుతున్నందునే ఆయన హత్యకు గురయ్యారంటూ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు సమగ్ర దర్యాప్తుతోనే వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించడంతో పాటు సీబీసీఐడి ఎంక్వయిరీ జరిపించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతానని మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం కార్యాలయం సైతం ఈ ఘటనకు దారితీసిన కారణాలపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఆరా తీసింది. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తుందా?.. లేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తుందా?.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనకు కారకులైనవారు ఎంతటి స్థాయిలో ఉన్నా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కేసీఆర్, హరీశ్‌రావులపై మృతుడి గురి
మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, డిజైన్ మొదలు ఎగ్జిక్యూషన్ వరకు అనేక లోపాలున్నాయని, సుమారు రూ. 1.35 లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని రాజలింగమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటి సీఎంగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి మొదలు చీఫ్ ఇంజినీర్ వరకు మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలైన మేఘా, ఎల్ అండ్ టీ సంస్థలను కూడా చేర్చారు. ఈ పిటిషన్‌పై జిల్లా కోర్టు, హైకోర్టుల్లో వేర్వేరు దశల్లో ఉన్నాయి. మరోవైపు స్థానికంగా భూ వివాదాల్లోనూ రాజలింగమూర్తి ఇరుక్కున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, చెరువుశిఖం భూములు కబ్జాకు గురవుతున్నాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెరవెనక పాత్ర పోషిస్తున్నారని కూడా పలు ఫిర్యాదుల్లో రాజలింగమూర్తి ప్రస్తావించారు.
పక్కా ప్లాన్ వెనక కిరాయి హంతకులు?
హత్య జరిగిన తీరుపైనా జిల్లాలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎస్పీ ఆఫీసుకు సమీపంలో జరగడం, రాత్రి సమయంలో లైటింగ్ లేకపోవడం, సీసీటీవీల్లో రికార్డు కాకపోవడం, బతికే అవకాశాలు లేకుండా కత్తులు, గొడ్డళ్ళతో దాడికి పాల్పడడం.. ఇవన్నీ అనేక సందేహాలకు కారణమయ్యాయి. ప్రొఫెషనల్ కిల్లర్స్ గా ఉండే కిరాయి హంతకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. నలుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నా సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రాలేకపోతున్నారు. పోలీసులకు ఇద్దరు లొంగిపోవడంతో ప్రాథమిక దర్యాప్తు మొదలైంది.
కేటీఆర్ ఆదేశాలతోనే..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతోనే తన భర్తను అతి కిరాతకంగా హత్య చేశారని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. కేటీఆర్ ప్రోద్బలంతో గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు భూపాలపల్లి మాజీ వైఎస్ చైర్మన్ హరిబాబు ఈ హత్య చేశారని ఆమె పేర్కొన్నారు. ‘నా భర్త వారి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అందుకే హత్య చేయించారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు ఎదురుగా సర్వే నంబర్ 319 లో మాకున్న భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి రేణికుంట్ల కొమురయ్య, రేణుకుంట్ల సంజీవ్ తో కొంతకాలంగా వివాదం జరగుతున్నది. ఆ భూమిని ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతోనే రేణుకుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్ కలిసి హత్య చేశారు. హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉంది.’ అంటూ రాజలింగమూర్తి భార్య సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సరళ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు. హత్యకు రేణుకుంట్ల సంజీవ్, సంజీవ్ బావమరిది శీమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలుస్తున్నది.
హత్య చేసింది ఎందరు..? వారి వెనుక ఎవరున్నారు?
రాజలింగమూర్తి హత్య ముమ్మాటికి ఒకటి బంధి ప్లాన్ ప్రకారం జరిగింది అనే చర్చ సాగుతున్నది. రెడ్డి కాలనిలో నివాసం ఉండే రాజలింగమూర్తి అంబేడ్కర్ సెంటర్ నుంచి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతున్నా క్రమంలో టీబీజీకెఎస్ కార్యాలయం సమీపంలో నిర్మానుష్యంగా ఉండే ఉండే ప్రదేశానికి చేరుకోగానే కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసి హతమార్చారు. హత్య చేసిన వారు ఎందరు..? ఇంత ధైర్యంగా వారు హత్య చేయడానికి వారికి ఎవరు ధైర్యం ఇచ్చారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేనికుంట్ల కొమురయ్య కుటుంబంతో రాజలింగమూర్తికి భూమి వివాదం ఉంది. అయితే వారు మాత్రమే ఇంతకు తెగించారా? ఆయన 171 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూములు సహా పలు ప్రభుత్వ భూముల కేటాయింపు విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులను వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దాంతో వారికి ఆయన కంట్లో నలుసులా తయారు అయ్యారు. దీనికి తోడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హరిబాబు తో మొదట సన్నిహితంగా ఉన్న తరువాత వీరి మధ్య వివాదం ముదిరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని అప్పటి సిఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సహా నిర్మాణ సంస్థ, అధికారుల పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో రాజలింగమూర్తి హత్య పై అనేక సందేహాలు వస్తున్నాయి. హత్య చేసిన వారి వెనుక ఎవరూ ఉన్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రాజలింగమూర్తి చేసిన ఫిర్యాదులు ఇవే..
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి బీఆర్ఎస్ నేతలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీద అనేక ఫిర్యాదులు చేశారు. అనేక అక్రమాలు వెలికితీశారు. అందుకే ఆయన మీద మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. బీఆర్ఎస్ హయాంలో పీడీయాక్ట్ పెట్టి ఏడాదిపాటు జైల్లో ఉంచారు. జైలు నుంచి విడుదలయ్యాక బీఆర్ఎస్ నేతల అక్రమాలపై రాజలింగమూర్తిపై అనేక ఫిర్యాదులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణారెడ్డి, ఆయన భార్య జెడ్పీ చైర్ పర్సన్ మీద ఫిర్యాదు చేశారు. 73 పేజీలతో హైడ్రాకు సైతం ఫిర్యాదులు చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరాఖాస్తులు చేస్తూ.. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ.. సివిల్ కోర్టులో కేసులు వేస్తూ బీఆర్ఎస్ నేతలకు కొరకరాని కొయ్యాగా తయారయ్యాడని తెలుస్తున్నది.
1. గండ్ర వెంకటరమణారెడ్డి నిజాంపేట్ మున్సిపాలిటీలోని బాచుపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 483 చంద్రయ్య కుంటలోని 1.20 గుంటల శిఖంభూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని 19-08-2024న హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
2. భూపాలపల్లిలోని సర్వే నంబర్ 209లో గొర్రెట్లకుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో 18 గుంటలు, 324లోని 20 గుంటల ప్రభుత్వ భూమిని రమణారెడ్డి భార్య గండ్ర జ్యోతి కబ్జా చేశారని భూపాలపల్లి కలెక్టర్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. వీటి విలువ రూ.15 కోట్ల పైనే ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ ప్రొసిడింగ్ తప్పుగా ఇచ్చారని పేర్కొన్నారు. అందుకు తాను ఇచ్చిన పిర్యాదుతోనే క్రైం నెంబర్ 34/2024 కేసు నమోదు చేశారని హైడ్రాకి ఇచ్చిన పిర్యాదులో తెలిపారు. కొత్త చెరువు భూములు, సర్వే నెంబర్ 314 లోని 5 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పటి తహసీల్దార్, కలెకర్లు గండ్ర వెంకటరమణారెడ్డికి అనుచరులకు రిజిస్ట్రేషన్ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిర్యాదులు చేశారు. దీనిపై హైకోర్టులో 2022లో రాజలింగమూర్తి కేసు పిల్ దాఖలు చేశారు.
3. భూపాలపల్లి – పరకాల మెయిన్ రోడ్డుకు సమీపంలో కొంపల్లి గ్రామరెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 171 లోని 777.24 గుంటల ఫారెస్ట్ ల్యాండ్ లో గండ్ర వెంకటరమణారెడ్డి సహాయంతో కలెక్టర్ కలెక్టర్ భవేశ్‌మిశ్ర 106 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేశారని 09-09- 2024న జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 171 సర్వే నెంబర్ బదులు 1003 అని తప్పుడు రికార్డులు సృష్టించి కోట్లు కొల్లగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే నంబర్ 324, 171 మధ్యలో ఉన్న ఖాళీ జాగాలో ఫుట్‌ఖరబ్ అంటూ 14 ఎకరాల భూమిని రైతుల పేరిట ఎక్కించారని హైకోర్టులో కేసు వేశారు రాజలింగమూర్తి. ఈ కేసులో తహసీల్దార్ కు నోటీసులు ఇవ్వడంతో 18 క్రిమినల్ కేసులు పెట్టారని కలెక్టర్ కు 5 నెలల క్రితం ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ కాలనీకి హాండోవర్ చేసిన భూముల్లో అక్రమంగా పట్టాలు చేసి ఇచ్చారని ఆరోపించారు.
సీబీసీఐడీ విచారణ చేపట్టండి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రాజలింగమూర్తి హత్య కేసు సిబిసిఐడి చేత విచారణ చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదన్నారు. సిబిసీఐడీ దర్యాప్తు చేసి అసలు బాధ్యులను శిక్షించాలి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాజలింగమూర్తి పోరాడుతున్నారన్నారు. సుపారీ ముఠా హత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయన్నారు. సుపారీ ముఠా వెనుకనున్న అసలు వ్యక్తుల బండారం బయటపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. హత్య చేసిన వారిలో ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారు. వాళ్లను వెనుక ఉండి కొంతమంది లొంగిపోయేలా చేశారనే అనుమానాలు ఉన్నాయని, సుపారి ముఠా వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ఎమ్మెల్యే సత్యనారాయణరావు అనుమానం వ్యక్తం చేశారు.