Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమానే కాదు ఇంతకు ముందు విశ్వక్‌సేన్ నటించిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ‘లైలా’ సినిమా, ఈ సినిమాలో విశ్వక్‌సేన్ పోషించిన లేడీ గెటప్ పాత్రకి సంబంధించిన మేకప్ ఖర్చులను కూడా రాబట్టలేక, తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర పరాజయాన్ని హీరో విశ్వక్‌సేన్ కూడా అంగీకరిస్తూ ఓ ఎమోషనల్ లెటర్‌ను విడుదల చేశారు.
మాములుగా అయితే విశ్వక్‌సేన్‌కి ఉన్న యాటిట్యూడ్ ప్రకారం, ఇలాంటి లెటర్ అస్సలు ఊహించలేం కూడా. కానీ నేను తగ్గాను, విషయం తెలుసుకున్నాను. ఇకపై ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటాను అంటూ ఈ లెటర్‌లో విశ్వక్‌సేన్ చెప్పడం విశేషం. అంతేనా, ఇకపై తన సినిమాలలో మాస్, క్లాస్ ఏదైనా సరే అసభ్యతకు తావులేకుండా చూసుకుంటానంటూ ప్రామిస్ చేస్తున్నాడు. మరి ఆ మాట మీద ఎంత వరకు నిలబడతాడో తెలియదు కానీ.. ఆయన విడుదల చేసిన లెటర్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎంతటివాడైనా మారాల్సిందే. మాస్ కా దాసైనా, ఇంకెవరైనా సరే.. నాలుగు ఫ్లాప్స్ పడితే వాళ్లే దారిలోకి వచ్చేస్తారు అంటూ విశ్వక్ విడుదల చేసిన లేఖపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అసలు ఈ లేఖలో ఏముందంటే..
Also Read- GV Prakash – Saindhavi: వారి విడాకులకు కారణం నేను కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు!
‘‘ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ- నా అభిమానులకు, నన్ను ఆశీర్వదించడానికి ఎప్పుడూ ముందుండే వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, నా కథానాయికలు – దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం’’ అంటూ విశ్వక్‌సేన్ ఎమోషనల్‌గా ఈ లెటర్‌లో రియాక్ట్ అయ్యారు.

రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ‘లైలా’ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా థియేటర్లలో వచ్చింది.
ఇది కూడా చదవండి:
Laila Movie: డామిట్.. ‘లైలా’ బట్టలు, మేకప్ ఖర్చు కూడా రాలేదా?