Endowment Department: ఏ ప్రభుత్వోద్యోగికైనా (Govt Employee) రెండేళ్లు.. గరిష్ఠంగా మూడేళ్ల వరకు మాత్రమే డిప్యూటేషన్‌కు అనుమతి ఇస్తారు. తర్వాత వారంతా గతంలో ఎక్కడైతే పనిచేశారో.. అదే స్థానానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ.. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చిన ఇతర శాఖల అధికారులు.. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ఠ వేసుకుని కూర్చుండిపోయారు. పైరవీలు, మచ్చికలు చేసుకుంటూ బండి నడిపించేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఘనులు రెన్యూవల్ కాకున్నా.. ఇక్కడే ఉంటూ మాతృ శాఖ నుంచి వేతనాలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖాళీల వల్లేనా?
దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం రిక్రూట్‌మెంట్లు చేయకపోవడంతో సుమారు 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎండోమెంట్‌లోని డైరెక్టు రిక్రూట్‌మెంట్ పరిధిలో 77, ఇంజినీరింగ్ విభాగంలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద (అడ్మినిస్ట్రేషన్ విభాగం) మొత్తం 209మంది ఉద్యోగులు ఉండాలి. కానీ.. ప్రస్తుతం 126 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు దేవాదాయశాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ పై కమిషనర్ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారితో పనిచేయిస్తున్నారు.ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక సంవత్సరం పర్మిట్‌తో వచ్చిన ఉద్యోగులు.. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ఠ వేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు సుమారు 12 నుంచి 15 వరకు ఇలా కొనసాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే వారు పనిచేస్తున్న కార్యాలయంలో పోస్టును ఖాళీ చూపించరు. వారు అక్కడ పనిచేయరు. పనిచేసేది ఒకచోట.. వేతనం తీసుకునేది మరోచోట. కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వచ్చినట్లు చూపుతారు.. కొత్తవారిని తీసుకోరు.. ఉన్నవారికి ప్రమోషన్లు సైతం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అర్హతలు ఉన్నా, సీనియార్టీ ఉన్నా వారిని కాదని డిప్యూటేషన్‌పై వచ్చిన వారినే కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
రెండు దశాబ్దాలుగా ఒకే దగ్గర!
కమిషనర్ కార్యాలయంలో ఓ ఉద్యోగి రెండు దశాబ్దాలుగా ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ఈవోగా ప్రమోషన్ వచ్చినా.. ఆయన మాత్రం కమిషనర్ కార్యాలయాన్ని వదిలిపెట్టకపోవడం గమనార్హం. కమిషనర్ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై ధర్మశాల నుంచి ఒకరు, అమీర్ పేట్ హనుమాన్ దేవాలయం నుంచి ఒకరు, మైసిగండి మైసమ్మ దేవాలయం నుంచి ఒకరు, వరంగల్ భద్రకాళి దేవాలయం నుంచి ఒకరు, సికింద్రాబాద్, భోలక్‌పూర్‌లోని భవానీ శంకరాలయంలో పనిచేసే ఒక వ్యక్తి, నల్లకుంట రామాలయం నుంచి ఒకరు, ధర్మపురి నుంచి ఒకరు, రాంమలింగేశ్వరాలయం నుంచి ఒకరు, ఉన్నతాధికారి పేషీలో ఉన్న ఈవో ఒకరు, అడిక్‌మెట్ హనుమాన్ దేవాలయంలోని పనిచేస్తున్న ఒకరు కమిషనర్ కార్యాలయంలో డిప్యుటేషన్ పై పని చేయిస్తున్నారు. భద్రకాళి దేవాలయం నుంచి వచ్చిన ఒక వ్యక్తి 30 ఏళ్లుగా ఇక్కడే కొనసాగుతున్నారని సమాచారం. మరో వ్యక్తి నాలుగేళ్ల క్రితం డిప్యూటేషన్ పై వచ్చి పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకుంటూ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం.
పైరవీలకే పెద్ద పీట
దేవాదాయశాఖ లో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒక సంవత్సరం అంటూ డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులు ఏటా రెన్యూవల్ చేసుకుంటూ కమిషనర్ కార్యాలయంలోనే ఉండిపోతున్నారు. ఎవరికైనా ఒకటి లేదా రెండేళ్లు మాత్రమే ఉంటుంది. అయిన్నప్పటికీ సిబ్బంది కొరత సాకుతో ప్రతి ఏటా రెన్యూవల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికిపై ఉన్నతాధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులు ఇక్కడే పదోన్నతులు వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి కదలడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులను వివరణ కోరితే సిబ్బంది తక్కువగా ఉండటంతో డిప్యూటేషన్ పై వచ్చిన ఉద్యోగులనే కొనసాగిస్తున్నారని తెలిపారు.
డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న మాట వాస్తవమే
దేవాదాయశాఖలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కమిషనర్ కార్యాలయంలో, ప్రముఖ ఆలయాల్లో సిబ్బంది కొరత ఉండటంతో కొంతమంది ఉద్యోగులను డిప్యూటేషన్ పై కొనసాగిస్తున్నాం. ఖాళీల భర్తీలను గుర్తించాలని ఇప్పటికే అధికారులను ఆదేశాలిచ్చాం. వాటి భర్తీకి చర్యలు తీసుకుంటాం. సేవల్లో ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం –మంత్రి కొండా సురేఖ (Konda Surekha)