CM REVANTH: కేసీఆర్ (KCR) హయాంలో ఆయనకు ఎదురొడ్డే నాయకుడిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న రేవంత్ రెడ్డి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ (CONGRESS) పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే, ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన సమర్థతపై అనుమానాలున్నాయి. కనీసం ఒకసారి మంత్రిగా కూడా చేయని రేవంత్… రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారనే అనే సందేహం అందరిలోనూ ఉండింది.
తొలి ఏడాది పాలనలో సీఎంగా రేవంత్ కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ముందుగా నిర్ణయం తీసుకొని తర్వాత వెనక్కి తగ్గిన సందర్భాలు చాలానే ఉన్నాయి.ఉదాహరణకి రాజముద్రలో మార్పలు దగ్గర నుంచి, లగచర్లలో భూ సేకరణ, ఇథనాల్ ఫ్యాక్టరీ మూసివేత తదితర అంశాల విషయంలో ప్రజల, ప్రతిపక్షాల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. ఇక హైడ్రా, మూసీ కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోపక్క హామీల భారానికి నిధుల కొరత తోడవడంతో పథకాల అమలు సమయానికి జరగక… ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ ఏదో చేస్తాడని ఆశలు పెట్టుకున్న ఉద్యమకారులు, మేధావులు సైతం… పాలన తీరు పట్ల ఒకింత నిరాశగా ఉన్నారు.
అయితే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్టట్టు… అసలే రైతు భరోసా అమలు కాక రైతులు, జీతాలు పడక ఉద్యోగులు, ఆర్టీసీ బస్సుల్లో సీటు దొరక్క పురుషులు ఇలా ఏ సెక్షన్ కు ఆ సెక్షన్ ప్రభుత్వం పై ఆగ్రహంతో ఉన్న వేళ.. కాంగ్రెస్ సొంత పీసీసీ వెబ్సైట్ లో ‘‘ఫామ్ హౌజ్ పాలన గొప్పదా? లేక ప్రజా పాలన గొప్పదా? ’’ అంటూ పెట్టిన ఆన్లైన్ సర్వే ప్రకంపనలు సృష్టించింది. ఆ సర్వేలో నెటిజన్లు ఫామ్ హౌజ్ పాలనకు ఎక్కువ ఓట్లు గుద్దారు. అంతే… ప్రతిపక్ష బీఆర్ ఎస్ కు మరో ఆయుధం దొరికింది. సీఎం ఎన్ని సార్లు మాటలతో రెచ్చగొట్టిన బయటకు రానీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్… మరుక్షణమే బయటకు వచ్చి… కాంగ్రెస్ పై చేయవలసిన విమర్శలు చేసి తమ క్యాడర్ కు నింపవలసిన ధైర్యం నింపేశారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు, ఎస్సీ వర్గీకరణ, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాల మీద లాక్కోవడాలు, పీక్కోవడాలు ఎలాగూ ఉన్నాయి.
ఇన్ని ప్రతికూల అంశాల మధ్య… ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ ఎం. గోపాల కృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకావిష్కరణకు హాజరైన సీఎం ఐఏఎస్ ల (IAS OFFICERS) మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చాలా మంది ఐఏఎస్ అధికారులకు ఏసీ జబ్బు పట్టుకుందని, వారు కార్యాలయం దాటి బయటికి రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్ర స్థాయిలో తిరిగి పనిచేస్తేనే ప్రజా సమస్యలపై అవగాహన వస్తుందని చురకలు వేశారు. సీఎం ఎంత పెద్దవాడైనా… తమకు కష్టసాధ్యమైన పనుల గురించి అంత పెద్ద లెక్చర్ ఇస్తే అధికారులు తట్టుకుంటారా.. పెదవి విరిచారు. భగ్గుమన్నారంటూ బీఆర్ఎస్ సొంత మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
కానీ, రేవంత్ వ్యాఖ్యలపై బుద్ధి జీవులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం… వ్యవస్థలో జరుగుతున్న వాటినే ప్రస్తావించారు తప్ప వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, కనీసం అధికారులు(కొందరు) ఇప్పటికైనా విమర్శలపై భుజాలు తడుముకోవడం మానేసి కాలు కదపాలని కార్యరంగంలోకి దిగాలని చెప్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారు రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. కొందరు ఐఏఎస్ ల ‘యాటిట్యూడ్’ అలాగే ఉంటుందని తన స్వీయ అనుభవాలను చెప్పుకొచ్చారు.
నిజానికి.. ఏదైనా శాఖకు పరిపాలన పరంగా ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉన్నతుడు. కానీ సదరు అధికారి క్షేత్ర స్థాయిలో ఎంత మేరకు పర్యటిస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు? వారికి ఎంత మేరకు అవగాహన ఉంది? ఉదాహరణకి… హెల్త్ సెక్రటరీ ఉన్నారనుకుందాం… ఆయన ఎన్ని ఆస్పత్రులు తిరుగుతారు. అసలెప్పుడైనా… తనిఖీలు చేశారా? కనుక్కుంటే మీకే తెలుస్తుంది. ఇలా… అధికారులు తమ వద్దకు వచ్చిన ఫైళ్లను క్లియర్ చేయడం మాత్రమే తమ డ్యూటీగా భావిస్తున్నారు, అది తప్పు అని మేధావుల వాదన. రేవంత్ ఆవేదన.
ఈ సందర్బంగా పలువురు శేషన్, ఎస్ ఆర్ శంకరన్ లాంటి రోల్ మోడల్ ఐఏఎస్ అధికారులను స్మరించుకుంటున్నారు. అలాంటి అధికారులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
ఏదైమైనా… ఐఏఎస్ లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రభుత్వ పైన ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ ను కొంతవరకు తగ్గించి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ను కొంత పెంచేలా ఉన్నాయని బయట మాట్లాడుకుంటున్నారు.