Sc/St Sub Classification: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మరింత సమగ్రంగా అధ్యయనం చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. గత ఏడాది నవంబర్ 11న కమిషన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నియమితులయ్యారు. మొదట కమిషన్ కు 60 రోజుల గడువిచ్చిన సర్కారు… ఆ లోగా నివేదికను సమర్పించాలని కోరింది.
అయితే, జనవరి 10వ తేదీతో ఆ గడువు ముగియడంతో ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. తాజాగా మరోసారి గడువును పొడిగించింది. కాగా, ఎస్సీ వర్గీకరణకు చట్టరూపం రావాల్సి ఉండటం, మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన నివేదికపై పలువురు అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో కమిషన్ గడువును మార్చి 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ 199 పేజీల నివేదిక అందజేసింది. ఇందులో మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ప్రతిపాదించింది. దానిని ఆమోదించిన సర్కారు… క్రీమీలేయర్ సిఫార్సును మాత్రం తిరస్కరించింది.
సుప్రీం కోర్టు తీర్పు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీం కోర్టు గతేడాది ఆగస్టులో కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని పేర్కొంది. ఆ తీర్పుకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.
కాగా, సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించి… సమగ్ర అధ్యయం కోసం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది.