Cm Revanth| సైబర్ నేరాల సొమ్ము రికవరీలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ (cyber crime) పోలీసులు ముందంజలో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సైబర్ పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని తెలిపారు. ఒకప్పుడు దొంగతనం ఇండ్లలోకి వెళ్లి చేయడం వల్ల నేరస్థులను ఈజీగా కనిపెట్టేవారని.. ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి సొమ్ము దొంగిలిస్తున్నారో అర్థం కాక దొంగలను పట్టుకోవడం పెద్ద టాస్క్ లా మారిందన్నారు.
సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా హెచ్ఐసీసీలో నిర్వహించిన షీల్డ్ 2025లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాల నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గతేడాది సైబర్ క్రైమ్ కేసుల విచారణ కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు రేవంత్ తెలిపారు. తెలంగాణలోనే ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను కూడా ఏర్పాటు చేస్తున్నామని.. త్వరలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అందజేయడంలో పోలీసులు అత్యంత వేగంగా పనిచేస్తున్నారని వివరించారు. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందే.. అంతే సమస్యగా ఉందన్నారు. కొన్ని సార్లు డీప్ ఫేక్, మాల్ వేర్ లాంటి వాటితో పెద్ద సమస్య ఏర్పడుతోందని.. కాబట్టి టెక్నాలజీని అప్ డేట్ చేసుకుంటూ కేసులు త్వరగా ఛేదించాలని పోలీసులను కోరారు.