New Ration Cards: తెలంగాణలో (Telangana) నూతన రేషన్ కార్డులపై (Ration Cards) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల కోడ్ (Election Code) అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నేడు పౌర సరఫరాల శాఖ (Civil Supplies) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో (Uttam Kumar Reddy) కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో త్వరితగతిన ఈ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. త్వరలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల జరగనున్న నేపథ్యంలో… ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కోడ్ అమలులో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ లేదు. దీంతో ఈ మూడు జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమీక్ష సమావేశంలో భాగంగా కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం…ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
కాగా, ప్రభుత్వం గత నెల జనవరి 26న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిర ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. అయితే, అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది.