సంక్షేమ పథకాలకు నిధుల విడుదలలో జాప్యం
ఇప్పటికే ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ సమ్మె బెడద
పెండింగ్‌లో కల్యాణలక్ష్మి, ఆసరా స్కీమ్స్
రుణమాఫీ చేసినా మైలేజ్ రాలేదనే చర్చ
రైతుభరోసా అమలవుతున్నా అసంతృప్తి
పేరుకుపోయిన బకాయిలతో సతమతం
పాత అప్పులు, వడ్డీలకే భారీగా చెల్లింపు
కేంద్రం నుంచి విడుదల కాని బకాయిలు
గ్రామీణ సంస్థలకు ఆగిపోయిన ఫండ్స్
కొత్త బడ్జెట్ తర్వాతే ఆర్థిక స్థితిపై క్లారిటీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్ర ప్రభుత్వానికి (TG Govt) నిధుల (Funds) సమీకరణ సమస్యాత్మకంగా మారింది. మ్యానిఫెస్టోలో (Manifesto), ఆరు గ్యారంటీల (Six Guarantees) కింద హామీ ఇచ్చిన పలు సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమల్లోకి వచ్చినా వాటికి సకాలంలో డబ్బులు విడుదల చేయడానికి సతమతమవుతున్నది. ఆశించిన స్థాయిలో రెవెన్యూ సమకూరకపోవడం, కేంద్రం నుంచి ఆర్థిక సహకారం లేకపోవడంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. కొన్ని పథకాలపై ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వచ్చినా మరికొన్నింటికి భారీగా నిధులు ఖర్చయినా తగినంత మైలేజ్ రాలేదని అటు ప్రభుత్వ, ఇటు పార్టీ (Congress Party) వర్గాల్లో జనరల్ చర్చ జరుగుతున్నది. పాత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు భారీగా చెల్లించాల్సి రావడంతో కొత్త అప్పుల ద్వారానే సర్దుబాటు చేస్తూ ఉన్నది. సొంత ఆదాయాన్ని పెంచుకోడానికి ముఖ్యమంత్రి పలు దఫాలుగా కీలక శాఖలను సమీక్షించి దిశానిర్దేశం చేసినా అవసరాలకు తగినంత వసూళ్ళు లేకపోవడం ఆర్థిక శాఖను ఆందోళనకు గురిచేస్తున్నదనే చర్చ సచివాలయ వర్గాల్లో నడుస్తున్నది.
సంక్షేమ పథకాలపై ప్రభావం :
రాష్ట్ర ప్రభుత్వానికి అంచనా మేరకు ఆదాయం లేకపోవడంతో ఆ ప్రభావం సంక్షేమ పథకాల అమలుపై పడింది. కల్యాణలక్ష్మి స్కీమ్‌కు సుమారు రూ. 460 కోట్ల మేర విడుదల చేయాల్సి ఉన్నదని, నిధుల సమస్య కారణంగానే ఏడాదిగా అమలు ప్రశ్నార్థకంగా మారిందని ఆర్థిక శాఖ వర్గాలే పేర్కొన్నాయి. ఆసరా పింఛన్ల విషయంలోనూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలుకు బదులు పాత విధానమే కొనసాగుతున్నదని గుర్తుచేశారు. మహిళలకు ప్రతి నెలా రెండున్నర వేల మేర ఆర్థిక సాయాన్ని అందిస్తామన్న హామీ గాడిన పడకపోవడానికి నిధుల కొరతే కారణమని సూచనప్రాయంగా తెలిపారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల రూపాయల వరకు అప్పులున్న రైతులకు రుణమాఫీని అమలు చేయడంతో దాదాపు రూ.20 వేల కోట్లను ఖర్చు చేయాల్సి వచ్చిందని, అది ఇతర పథకాలు లాంచింగ్ కావడానికి ఇబ్బందికరంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఇంత ఖర్చు చేసినా ప్రభుత్వానికి ఈ స్కీమ్‌తో మైలేజ్ రాలేదన్నారు.
పెండింగ్ బకాయిలతో చిక్కులు :
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్‌ను ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే అమల్లోకి తెచ్చింది. దీనితో మైలేజ్ దక్కినా రీయింబర్స్ చేయడంలో చిక్కులు తప్పలేదు. డిసెంబర్ 2024 వరకూ ప్రభుత్వం నుంచి నిధులు అందినట్లు ఆర్టీసీ యాజమాన్యం చెప్తూ ఉంటే కార్మిక సంఘాల ప్రతినిధులు మాత్రం దాదాపు రూ. 1,200 కోట్ల మేర ఇంకా బకాయిలు ఉన్నాయంటున్నారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఇటీవలే సమ్మె నోటీసు ఇచ్చారు. మరోవైపు ఆరోగ్యశ్రీ స్కీమ్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపిస్తూ ప్రైవేటు ఆస్పత్రులు ఇటీవలే వైద్య సేవలను నిలిపివేశాయి. పాక్షికంగా నిధులను విడుదల చేయించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. సమ్మెను కొలిక్కి తెచ్చినా ఇంకా రూ.720 కోట్ల మేర రిలీజ్ చేయాల్సి ఉన్నది.
అంచనాలను అందుకోని ఆదాయం :
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.21 లక్షల కోట్ల మేర రెవెన్యూ (Revenue) ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నా తొమ్మిది నెలల్లో (డిసెంబర్ 2024 నాటికి) 50 శాతమే సమకూరింది. రిజర్వు బ్యాంకు ద్వారా అప్పులు, కేంద్రం నుంచి గ్రాంట్లు, పన్నేతర ఆదాయం.. ఇవన్నీ కలుపుకొన్నా మొత్తం రూ. 2.74 లక్షల కోట్లకుగాను రూ. 1.60 లక్షల కోట్లే సమకూరాయి. బహిరంగ మార్కెట్ ద్వారా దాదాపు 98% మేర రుణాలను తొమ్మిది నెలల్లోనే తీసుకున్నా, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ. 21 వేల కోట్లకు పైగా వస్తాయని అంచనా వేసుకున్నా, చివరకు రూ.4,771 కోట్లే (22%) అందాయి. పన్నేతర ఆదాయం ద్వారా రూ.35 వేల కోట్లకు మించి వస్తుందని ఆశించినా అది రూ.5,487 కోట్ల (15%) దగ్గరే ఆగిపోయింది. ఒకవైపు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం ద్వారా ఆదాయం తగ్గిపోయిందనే ఆందోళన ఉండగానే గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగినందున ఈ విభాగం నుంచి సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే బడ్జెట్‌లోనే వెల్ఫేర్‌కు ఫండ్స్ :
ప్రస్తుత బడ్జెట్ (Budget) లో పలు స్కీమ్‌లకు నిధుల విడుదల సమస్యగా మారడంతో కొత్త బడ్జెట్‌లోనే కేటాయింపులుండే అవకాశమున్నదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నందున దాన్ని తిప్పికొట్టేలా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. వివిధ శాఖలతో డిప్యూటీ సీఎం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లో బడ్జెట్ సెషన్ కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సాయం, తులం బంగారం తదితరాలకు కేటాయింపులు చేయడంతో పాటు మరికొన్ని స్కీమ్‌లను లాంఛనంగా ప్రారంభించే అవకాశమున్నది. నిధులకు కొరత లేదని, కేంద్ర ఆర్థిక సంఘం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు ఫండ్స్ రాకపోయినా సర్దుబాటు చేయగలుగుతామని డిప్యూటీ సీఎం చెప్తున్నా సర్దుబాటు చేయడం సవాలుగా మారింది. కేంద్రం నుంచి గ్రాంట్లు మాత్రమే కాక పెండింగ్ బకాయిలు విడుదల కానందున రాష్ట్ర సర్కారు దగ్గరున్న ప్రత్యామ్నాయాలేంటనే చర్చ జరుగుతున్నది.