Srinuvas Reddy | మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో జరిగిన కోళ్ల పందేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అక్కడ జరిగిన ఘటన తనకు తెలియకుండానే జరిగిందన్నారు. ఘటన జరిగిన రోజు తాను అసలు హైదరాబాద్ లోనే లేనని.. వరంగల్ లోని ఎల్లమ్మ పండగ వద్ద ఉన్నట్టు చెప్పారు. మొయినాబాద్ లోని తొల్కట్టలో తాను 2018లోనే భూమిని కొన్నానని.. దాన్ని తన మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి చూసుకుంటున్నాడంటూ ఆయన వివరించారు.
అక్కడ ఫామ్ హౌజ్ లేదని.. కొబ్బరితోట, మామిడితోట, పనివాళ్ల కోసం రెండు గదులు మాత్రమే ఉన్నాయన్నారు. జ్ఞానదేవ్ తనకు తెలియకుండా ఆ భూమిని వర్రా రమేశ్ రెడ్డికి కౌలుకు ఇచ్చినట్టు నిన్ననే తెలిసిందన్నారు. వర్రా రమేశ్ కూడా ఆ భూమిని ఎం.వెంకటపతిరాజుకు కౌలుకు ఇచ్చినట్టు ఈ ఘటనతోనే తెలిసిందన్నారు. కాబట్టి అక్కడ జరిగిన ఆ ఘటన తన ప్రమేయంతో జరగలేదని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటివి తనపై బురదజల్లేందుకు చేస్తున్నారని ఆరోపించారు.