Bhatti Vikramarka: పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే సర్కారు స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుందని హైదరాబాద్ నగరం తో పాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగంలో గాలి నాణ్యత సూచీ, గాలి నాణ్యత నిర్వహణ” అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటని, హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదిగిందని, ఈ అభివృద్ధి మనకు గర్వకారణమని తెలిపారు.
దృఢ సంకల్పంతో ప్రభుత్వం
అదే సమయంలో ఇది మనపై మరింత బాధ్యతను కూడా పెంచుతుందన్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను ఎదురెదురుగా నిలబెట్టలేమని, అవి చేతులు కలిపి ముందుకు నడవాలని డిప్యూటీ సీఎం సూచించారు. సుస్థిర అభివృద్ధి ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. అదే సమయంలో జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై కూడా తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. శుభ్రమైన గాలి లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. గాలి నాణ్యత ఒక పర్యావరణ సూచీ మాత్రమే కాదని, అది ప్రజారోగ్య సూచీ అని గుర్తు చేశారు. 2024 ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్’ సహా ప్రపంచ స్థాయి అధ్యయనాలు ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయని తెలిపారు.
ప్రతి ఏడాది 80 లక్షలకు పైగా అకాల మరణాలు
నేడు గాలి కాలుష్యం, అధిక రక్తపోటు ప్రపంచంలో మరణాలకు రెండో ప్రధాన కారణంగా మారిందని, ప్రతి ఏడాది 80 లక్షలకు పైగా అకాల మరణాలకు ఇది కారణమవుతోందన్నారు. ఇది మన పిల్లలను, వృద్ధులను, పని చేసే జనాభాను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం, గాలి కాలుష్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోందని, అందుకే శుభ్రమైన గాలి గురించి మాట్లాడినప్పుడు, మనం మనుషుల జీవితాల గురించి, ఆర్థిక బలం, సామాజిక శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నామన్నారు.హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఇప్పటికే గుర్తింపు పొందిందన్నారు. కానీ అదే సమయంలో మన నగర వ్యవస్థలు కూడా అంతే వేగంగా పరిపక్వత చెందాలని ఆయన ఆకాంక్షించారు.
శాస్త్రీయమైన విధానాన్ని అనుసరిస్తోంది
తెలంగాణ ప్రభుత్వం లక్ష్యాధారితమైన, శాస్త్రీయమైన విధానాన్ని అనుసరిస్తోందనన్నారు. 2024లో గాలి నాణ్యత పర్యవేక్షణ నెట్వర్క్ను రెట్టింపు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేశామని, దీని ద్వారా రియల్ టైమ్, విశ్వసనీయ డేటా అందుతుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు అందిస్తున్నామని, ఈ-బస్సులు, మెట్రో విస్తరణ ద్వారా ప్రజా రవాణాను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులు కల్పిస్తున్నామని, పాత, కాలుష్యకర వాహనాలను తొలగించేందుకు రిజిస్టర్డ్ వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించామన్నారు. పరిశ్రమల ఉద్గారాలను నిరంతర పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా కాలుష్య నియంత్రణ మండలి సర్వర్లకు అనుసంధానించామన్నారు. కాలుష్య నివారణ నియమావళి అమలును కఠినతరం చేస్తున్నామన్నారు. సంబంధిత శాఖలన్నీ ఈ ఉత్తమ విధానాలను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అధ్యయనం చేసి అమలు చేయాలని కోరారు.
Also Read; Bhatti Vikramarka: సింగరేణిపై కట్టుకథలు.. ఏ గద్దల్ని వాలనివ్వను.. భట్టి విక్రమార్క ఫైర్

