KTR On KCR Notices: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) గురువారం నాడు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) సిట్ నోటీసులు (KTR On KCR Notices) జారీ చేసింది. ఈ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హరీష్ రావు సహా ఇప్పటికే పలువురు నేతలు ఖండించగా, తాజాగా ఈ జాబితాలో కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) చేరారు. ఇది విచారణ కాదు… ఇది ప్రతీకారం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది న్యాయం కాదని, ఇది రాజకీయ దురుద్దేశమని ఆయన అభివర్ణించారు.
‘‘ కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. బీఆర్ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు, ప్రజల తీర్పుతోనే రాస్తారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also- Ranveer FIR: దైవ నృత్యాన్ని అనుకరించినందుకు రణవీర్ సింగ్‌పై కేసు.. ఎక్కడంటే?
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే..
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నోటీసులు ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. విచారణల పేరుతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన, కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
‘‘చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్. అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది’’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
Read Also- KCR SIT Notice: గులాబీ నేతకు సిట్ నోటీసులు.. కాసేపట్లో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ అత్యవసర భేటి!
మా ఊపిరితిత్తులతో ఊది ఊది మండిస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ పార్టీ మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ, అవసరం లేని వ్యవహారానికి, చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియకు, ట్యాపింగ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఈ పర్వం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ప్రజల్ని మోసం చేసి, పరిపాలన చేతకాక, కుంభకోణాల మత్తులో జోగుతున్న కాంగ్రెస్ దుర్మార్గాలను ప్రశ్నిస్తే తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్‌కు నోటీసులా? అని ప్రశ్నించారు. ‘‘ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటదా?, కాంగ్రెస్ దొంగల్లారా, మీ దోపిడి పాలనకు నిప్పులంటుకుంటున్నాయ్.. మా ఊపిరితిత్తులతో ఊది ఊది మండిస్తాం’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

