Kothagudem CPI: కొత్తగూడెం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(CPI) పార్టీ కాంగ్రెస్(Congress) పార్టీ అలయన్స్ తో పోటీ చేసి బీఆర్ఎస్(BRS) పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని సిపిఐ పార్టీ కైవసం చేసుకుంది. నాటికి నేటికి కాంగ్రెస్, సిపిఐ పార్టీలు కలసి లేకపోవడంతో పలు రకాల చర్చలకు దారితీస్తోంది. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన 250 కుటుంబాలకు పైగా చేర్చుకుని తమ పార్టీని బలంగా చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కాంగ్రెస్ పై.. సిపిఐ పై చేయి సాధిస్తుందా..?
ఇటీవల జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో కొత్తగూడెం(Kothagudem) అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ తన బలాన్ని పుంజుకునేలా వివిధ రకాల ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం సిపిఐ పార్టీ సాధించే దిశగానే అక్కడి పరిణామాలు స్పష్టం అవుతున్నాయి. ఇవన్నీ గమనిస్తే రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా సిపిఐ పార్టీ పావులు కదుపుతుండడం గమనార్హం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ నాయకుల మధ్య పూర్తిస్థాయి సయోధ్య కుదరడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బలమైన నాయకులను అప్పటి బి ఆర్ ఎస్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateshwar Rao) ఆ పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గానే ఉన్నట్లుగా అక్కడ ప్రజల్లో చర్చ తీవ్రంగా జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే కాంగ్రెస్ పార్టీపై సిపిఐ పార్టీ పై చేయి సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా.? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: Casting Couch: మెగాస్టార్ చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి శ్రీపద.. ఎందుకంటే?
50 కుటుంబాలు సిపిఐలో చేరిక..
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలోని వివిధ పార్టీలకు చెందిన 147 కుటుంబాలను ఇటీవలనే ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఆధ్వర్యంలో సిపిఐలో చేరిపోయారు. మంగళవారం సైతం కొత్తగూడెం కార్పొరేషన్ ఏడవ డివిజన్ వనమా కాలనీ నుండి బండి రమిని ఆధ్వర్యంలో 50 కుటుంబాలు సిపిఐ పార్టీలో చేరాయి. కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీలకు చెందిన కుటుంబాలు సిపిఐ పార్టీలో చేరిపోయేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
మునిసిపల్ నగరపాలక సంస్థపై ఇరుపార్టీల గురి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పనిచేసే సిపిఐ(CPI)కి కేటాయించిన అసెంబ్లీ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై ఇరు పార్టీలు గురిపెట్టాయి. నువ్వా… నేనా అన్నట్లుగా కాంగ్రెస్(Congress), సిపిఐ(CPI) పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఏదేమైనప్పటికీ సిపిఐ పార్టీ మాత్రం రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠంపై కన్నేసి ప్రణాళిక బద్ధంగా పకడ్బందీగా తమ వ్యూహాలను రచించుకుంటుంది. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అక్కడ తమ ఉత్సాహాన్ని చూపకపోవడం, పదునైన వ్యూహాలను రచించకపోవడం స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఎక్కువసార్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఆ ముగ్గురు మంత్రులు పకడ్బందీగా పని చేస్తే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం అతి సులువుగా మారుతుంది. అయితే ఇప్పటికీ మేయర్ పీఠం సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిస్థాయి ప్రణాళికను రచించుకోకపోవడం గమనార్హం. ఏదేమైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సరైన దృష్టి సారిస్తే సిపిఐ కి దక్కకుండా మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అహర్నిశలు కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయంతో సరైన దృష్టి సారించి ప్రయత్నాలు సాగిస్తే మేయర్ పీఠం అతి సులువుగా దక్కించుకోవచ్చని చర్చలు కూడా సాగుతున్నాయి.
Also Read: India EU FTA: ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’.. భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం

