Megastar Chiranjeevi | మంగళవారం జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇంటినిండా ఆడపిల్లలు ఎక్కువయ్యారని, ఈసారైనా రామ్ చరణ్‌ని ఒక బాబుని కనమని అడుగుతున్నానని, లెగసీ కంటిన్యూ అవ్వాలని ఉంటుందిగా.. అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతున్నారు. కేవలం మగపిల్లలే వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతారా? ఆడపిల్లలు తీసుకెళ్లరా? అయినా, మెగాస్టార్ వంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు, చిరంజీవి తప్పుగా మాట్లాడారు అంటూ ఆయనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. నిజంగా చిరంజీవి తప్పుగా మాట్లాడారా? మనవడు కావాలని అడగడం తప్పా? ఒక్క మనవడిని ఇవ్వమని అడిగినందుకే ఆడపిల్లల ద్వేషిగా చిరంజీవిని చిత్రీకరిస్తారా? మెగాస్టార్ ఏ సందర్భంలో అలా మాట్లాడారో కూడా తెలుసుకోకుండా, ఇష్టం వచ్చినట్లుగా రాతలు, కూతలు అవసరమా? ఓ సెక్షన్ మీడియా కావాలని చిరంజీవిని టార్గెట్ చేస్తూ.. ఈ విషయంతో పబ్బం గడుపుకోవాలని చూస్తుందా? అంటే సోషల్ మీడియా ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా అవుననే చెబుతారు.కానీ, చిరంజీవిని ఎంత ట్రోల్ చేస్తే.. అంత ఆయనకు ప్లస్సే అవుతుంది తప్పితే.. ఎప్పుడూ మైనస్ కాదనే విషయం వారికి తెలియనిదా? ఆ విషయం తెలిసి కూడా పదే పదే అదే చేస్తున్నారంటే వారికంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు.
అసలు చిరంజీవి ఏమన్నారంటే..
‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ వేడుకలో స్టేజ్ పై ఉన్న తెరపై కొన్ని ఫొటోలను చూపించి వాటి గురించి మెగాస్టార్‌ని అడుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో తన మనవరాళ్లతో మెగాస్టార్ ఉన్న ఫొటోని డిస్‌ప్లే చేశారు. ఈ ఫొటోని ఉద్దేశిస్తూ చిరు చమత్కరించారు. ఇంట్లో నా మనవరాళ్లతో ఉంటే.. ఇళ్లంతా ఒక లేడీస్ హాస్టల్‌లా ఉంటుందని, నేను వాళ్లకి గార్డెన్‌లా అనిపిస్తానని చిరు అన్నారు. అందుకే ఈసారైనా రామ్ చరణ్‌ని ఒక మగపిల్లాడిని ఇవ్వమని అడుగుతున్నాను. మెగా లెగసీ కంటిన్యూ అవ్వాలనేది కోరిక. మళ్లీ ఇంకో అమ్మాయినే కంటాడేమో అని భయంగా ఉందంటూ.. ఆ ఫొటోలో ఉన్న పిల్లలందరినీ లవ్ లీ కిడ్స్ అని చిరు సరదాగా అంటే.. ఈ వేడుకకి హాజరైన వారంతా హాయిగా నవ్వుకున్నారు. కానీ అదే కాంట్రవర్సీ అవుతుందని బహుశా చిరంజీవికి కూడా తెలిసి ఉండదేమో.
చిరంజీవి మనవడిని కోరుకోవడం తప్పా?
సోషల్ మీడియా ప్రభావంతో ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఒక మాటకి ఎన్ని రకాల అర్థాలు కావాలంటే అన్ని రకాల అర్థాలు తీస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫంక్షన్‌లో మాట్లాడాలంటేనే భయపడేలా పరిస్థితులు మారిపోతున్నాయి. ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భయంలో.. ఒక్కోసారి స్టేజ్‌పై ఏదో మాట్లాడదామనుకుని వెళ్లి, ఇంకేదో మాట్లాడేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా ఎక్కువైంది కూడా. అందులోనూ స్టార్ హీరోలు ఒక వేడుకకి హాజరవుతున్నారంటే.. వారు అక్కడ ఏం మాట్లాడతారో.. అందులో నుండి ఏ పాయింట్‌ని తీసుకుని ట్రోల్ చేయాలా? అని ముందే ప్లాన్ చేసుకుంటున్నారు. లేదంటే, చిరంజీవి మనవడిని కోరుకోవడం ఎలా తప్పు అవుతుంది? ఆ మాటకే ఆడవాళ్లని చిరు కించపరిచినట్టా? చిరంజీవి ఇంట్లో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. తన చెల్లెళ్లలను చిరు ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ల అమ్మ అంజనమ్మని, భార్య సురేఖని, కోడలు ఉపాసనని, ఇంకా ఆయన ఫ్యామిలీలోని ఆడవాళ్లని, లేడీ అభిమానుల పట్ల చిరు ఎలా ఉంటారో తెలిసి కూడా, ఇలా ఎలా ట్రోల్ చేయాలని అనిపిస్తుందో వారి విజ్ఞతకే వదిలేయాలి. మరి ఈ ట్రోలింగ్‌పై చిరు రియాక్షన్ ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ..