Bhatti Vikramarka: సింగరేణిలో ఏదో జరిగిపోతోందంటూ ఓ ప్రధాన మీడియా సంస్థ గతవారం రాసిన కథనంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోమారు అసహనం వ్యక్తం చేశారు. సదర్ ఛానల్ ఎండీ పేరు ప్రస్తావిస్తూ మీరు రాసింది అవాస్తవమని ఒప్పుకోవాలని పట్టుబట్టారు. లేదంటా దీనిని తన వ్యక్తిత్వ హననంగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరి సంతోషం కోసం, ఎవరిని ఆనందపరచడం కోసం ఈ వార్త రాశారో ఆయనకే తెలియాలంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.
‘సింగేరణిపై గద్దలను వాలనివ్వను’
శనివారం ఉదయం జ్యోతిరావు పూలే భవన్ లో ఆయన ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉంటూ ఉన్నత విలువలు పాటిస్తున్న తన వ్యక్తిత్వంపై దాడి చేయడం సమంజసం కాదని భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని, వారి శ్రమను స్వయంగా చూశానని పేర్కొన్నారు. కాబట్టి సింగరేణిపై ఏ గద్దలు, రాబంధులు, పెద్దలను వాలనివ్వనని భట్టి స్పష్టం చేశారు. తప్పుడు రాతలతో సింగరేణి సంస్థకు కార్మికులకు నష్టం కలిగించడం శోచనీయమని పేర్కొన్నారు. మరోవైపు సృజన్ రెడ్డి కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని భట్టి తేల్చి చెప్పారు.
విషపు రాతలపై ఆగ్రహం
తనపై రాసిన విషపు రాతలపై సదరు వార్త సంస్థ ఎండీ నిరాధారమైనవిగా ప్రకటించాలని భట్టి డిమాండ్ చేశారు. అవన్నీ అవాస్తవాలని స్వయంగా తిరిగి రాయాలని పట్టుబట్టారు. లేని పక్షంతో వ్యక్తిత్వ హననం జరిగిందిగా భావిస్తానన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురిచేశాయన్నారు. సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన టెండర్లు కానీ వాటికి సంబంధించిన ఫైళ్లు గానీ తన వద్దకు గానీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. పారదర్శకంగా సేవలు అందించేందుకు సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉందని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని, వారంతా ఒక స్వయంప్రతిపత్తి (Autonomous) తో నిర్ణయాలు తీసుకుంటారని అని పేర్కొన్నారు.
‘సైట్ విజిట్’ నిబంధనపై..
సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ కాంట్రాక్ట్ విషయంలో సైట్ విజిట్ చేయాలన్న నిబంధన బోర్డు తీసుకున్నదేనని భట్టి విక్రమార్క చెప్పారు. సదరు వార్త సంస్థ తానేదో ఆ నిబంధన పెట్టించినట్లు రాయడాన్ని భట్టి తప్పుబట్టారు. ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని కేవలం కొందరు భట్టి విక్రమార్కకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చేశారంటూ కట్టు కథనాలను, పిట్ట కథలను అల్లి వార్త ప్రచురించారని విమర్శించారు. ఈ నిబంధన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పొందుపరిచారు అన్నది పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన అని, తాము కొత్తగా రూపొందించింది కాదు అని స్పష్టం చేశారు.
Also Read: KTR – Janasena Party: కేటీఆర్ ఇలాకాపై జనసేన కన్ను.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ.. హీటెక్కిన రాజకీయం!
‘తప్పుడు ప్రచారాలు వద్దు’
‘సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుంది’ అని భట్టి హెచ్చరించారు. సింగరేణి కార్మికుల చెమటతో ఏర్పడిన ఈ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో రాబందులకు అప్పగించనని శపథం చేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు గనుల అభివృద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి, ఆదాయం తగ్గి వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యమైన బొగ్గు గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని భట్టి విజ్ఞప్తి చేశారు.

