Police Officers:
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: శాంతిభద్రతల కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది (Police Officers) మానసిక స్తైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. క్షమాపణలు చెప్పని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన తరువాత మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో పోలీసు అధికారులను ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని, దురుద్దేశపూరితమైనవని, చట్ట విరుద్ధమైనవని గోపిరెడ్డి పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రతిష్ట, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని
దెబ్బ తీసేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also- Bandi Sanjay On KTR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై మరోసారి బండి సంజయ్ ఆరోపణలు
కేసుల దర్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాలు సేకరించటం, వాటిని పునసమీక్షించుకోవటం, ఎవరినైనా విచారణకు పిలిపించే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్, బీఎన్ఎస్, బీఎస్ఏ చట్టాల పరిధిలో రాజకీయాలకు అతీతంగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఈ కేసులోనైనా నిజానిజాలు ఏమిటన్నది నిర్ధారించే అధికారం పూర్తిగా న్యాయ స్థానాలదే అని చెప్పారు. విచారణ జరుగుతున్న సమయంలో దర్యాప్తు అధికారులై నిరాధార, బాధ్యతారహిత, అవమానకర వ్యాఖ్యలు చేయటం సరైంది కాదన్నారు.ఇలాంటి వాటిని న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయటంతోపాటు దర్యాప్తు అధికారులను బెదిరించటానికి చేసినట్టుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులు ఎవరిపట్ల వ్యక్తిగత ద్వేషాలు, ప్రతీకార భావనలతో పని చేయరని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనుచితమన్నారు. వెంటనే హరీష్ రావు తాను అన్న మాటలను ఉపసంహరించుకుని రాష్ట్ర పోలీసు శాఖకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also- Groundnut Price: రికార్డ్ స్థాయిలో వేరుశనగ ధర.. తొలిసారి ఎంతకు పెరిగిందంటే?

