Electricity Department: తెలంగాణ విద్యుత్ శాఖలో బదిలీల ప్రక్రియ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే బదిలీలు చేపడుతూ, వేలాది మంది ఆర్టీజన్లను పక్కన పెట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ వివక్ష వెనుక అసలు కారణం ముడుపులు ఉండకపోవడమేనా అనే సందేహాలను ఆర్టీజన్లు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ, ఆర్టీజన్లను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 20,351 మంది ఆర్టీజన్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత కాల పరిమితి ముగిసిన తర్వాత బదిలీలు చేపట్టాల్సి ఉన్నా, అధికారులు మాత్రం ఆర్టీజన్ల విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2022 తర్వాత లేని బదిలీలు
రెగ్యులర్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చకచకా సాగుతుంటే, తమను ఎందుకు విస్మరిస్తున్నారని ఆర్టీజన్లు ప్రశ్నిస్తున్నారు. బదిలీల ప్రక్రియలో పారదర్శకత లేదని, కేవలం ఆర్థిక ప్రయోజనాలు ఉండే చోటనే అధికారులు ఆసక్తి చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముడుపులు ఉండవనే ఉద్దేశంతోనే తమ బదిలీలను తొక్కి పెడుతున్నారా అని ఆర్టీజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. 2021, 2022 తర్వాత ఇప్పటివరకు బదిలీలు చేపట్టలేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడేండ్లకు ఆర్టీజన్లకు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంది. కానీ అందుకు అనుగుణంగా చేపట్టకపోవడం, రెగ్యులర్ ఉద్యోగులను ఒకలా, తమ ఒకలా చూడడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని ఆర్టీజన్లు చెబుతున్నారు.
Also Read: Oppo Smart Phone: భారత్ లో లాంచ్ అయిన ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే!
ఉద్యోగులను బదిలీ చేయాలి
ఆర్టీజన్లు ఒక ఉద్యోగం నుంచి మరొక సమానమైన ఉద్యోగానికి లేదా ఒక విభాగం యూనిట్ నుంచి మరే ఇతర విభాగానికి బదిలీ చేసే అధికారం కంపెనీకి ఉంది. అలాగే, 2021లో సబ్ ఇంజినీర్లు, ఆర్టీజన్లకు సంస్థ చేపట్టిన బదిలీల్లోనూ ఒకే పోస్ట్‌లో మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ ఈ నిబంధనలు తుంగలో తొక్కారని విమర్శిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా ఒకే చోట పని చేస్తున్న తమకు బదిలీలు కల్పించి, సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం కల్పించాలని ఆర్టీజన్లు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ పెద్దల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అయినా సమీప ప్రాంతాలకు బదిలీలు చేపట్టాలని అడుగుతున్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి ఈ వివక్షను వీడకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Also Read: Electricity Department: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సమీక్ష!

