Illegal Admissions: అక్రమ పద్దతిలో అడ్మిషన్లు
పదో తరగతి పూర్తి కాకుండానే ఇంటర్ ప్రవేశాలు
ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని జిల్లా విద్యాధికారులు
తల్లిదండ్రులకు ఫోన్లు, మెసేజ్‌లతో గాలం వేస్తున్న కార్పొరేట్ కాలేజీలు
ప్రభుత్వాలు మారినా… విద్యాసంస్థల తీరు అదే
కాసులే లక్ష్యంగా విద్యార్థులను మోసం
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ప్రతి ఏడాది ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థల వ్యవహారంలో మార్పు కనిపించడం లేదు. వ్యాపారమే పరమావధిగా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు పయణిస్తున్నాయి. కానీ అటు ప్రభుత్వ నిబంధనలు.. విద్యార్థుల ఆలోచన విధానం పరిగణలోకి తీసుకోకుండా దుర్మార్గంగా పనిచేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు పూర్తి కాలేదు. విద్యార్థులు పరీక్షలే వ్రాయలేదు. ఇలాంటి పరిస్థితిలో అడ్మిషన్స్ పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు వసూళ్లకు (Illegal Admissions) పాల్పడుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను ఆసరా చేసుకొని ఇంటర్ సీట్ కోసం రిజర్వేషన్ చేయిస్తున్నారు. ఆ సీట్ రిజర్వేషన్ కోసం రూ.వేలల్లో నగదును వసూళ్లు చేస్తున్నారు. ప్రవేశం ఉపయోగించుకుంటే అడ్మిషన్ కన్ఫర్మ్… లేకపోతే తిరిగి నగదు ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఆవలంబిస్తున్న ఇంటర్ విద్యా విధానం పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘానే. ప్రభుత్వాలు మారినప్పటికి అక్రమార్కులను కట్టడి చేయడంలో అధికారులు విఫలమైతున్నారు.
ఆరు నెలల సమయం ఉన్నా….
2025-26 విద్యాసంవత్సరం పూర్తికాకుండానే 2026-27 కు అడ్మిషన్లు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రయివేట్ కాలేజీలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థి తల్లిదండ్రులనే లక్ష్యంగా అడ్మిషన్స్ దందాను కాలేజీ యాజమాన్యం నడిపిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సవంత్సరం ముగిసేందుకు 3నెలలు… మరో 3నెలల్లో ఫలితాలు వస్తాయి. అయితే ఇంకా 6నెలల సమయం ఉండగానే అడ్మిషన్స్ చేయడం పై జిల్లా ఇంటర్ విద్య అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం. అధికారులు కార్పొరేట్ కాలేజీ మాయలో పడి ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. పిర్యాదులు చేసిన పట్టించుకోని వైనం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కనిపిస్తుంది.
Read Also- Arrive Alive Program: 100 మంది సర్పంచులతో ప్రతిజ్ఞ చేయించిన మెదక్ ఏఎస్పీ.. ఎందుకంటే
ఈ నిబంధనలు అవసరం లేదా…!
ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం, పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత బోర్డు అధికారికంగా అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేయాలి. అప్పటి వరకు ఎలాంటి ప్రవేశాలు చేపట్టకూడదు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రవేశ పరీక్షల పేరుతో హడావుడి చేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు టాలెంట్ టెస్టుల పేరుతో పరీక్షలు నిర్వహించి, ఇప్పుడే అడ్మిషన్ ఫీజులు కట్టించుకుంటున్నాయి. ఇంటర్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకపోయినా అడ్మిషన్ ఫారాలు నింపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బహిరంగంగానే ప్రకటనలు…
రాష్ట్రంలో మొత్తం కార్పోరేట్ కాలేజీల్లో దాదాపు మెజారిటీ కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ప్రయివేట్ కాలేజీలు పీఆర్వోలను నియమించుకొని ప్రచారం చేస్తున్నాయి. జేఈఈ, నీట్,ఎప్ సెట్ లో స్పెషల్ కోచింగ్ పేరుతో మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తే ఫీజులో రాయితీ అంటూ పీఆర్ఓలు ప్రచారం చేస్తున్నారు. నగర శివారుల్లోబహిరంగంగానే ప్రకటనలుపెట్టి ప్రచారం షురూ చేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ కాలేజీల్లో సీట్లు కావాలంటే గరిష్టంగా రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.
Read Also- Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీలో బిగ్ బజ్!.. హీరో ఎవరంటే?
ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్న కాలేజీలపై అధికారులు ప్రేమ చూపిస్తున్నారని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అన్నారు. ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకుండా వదిలేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఆ కాలేజీ ల పై విచారణ చేసి చర్యలు చేపట్టి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

