Davos 2026: దావోస్ లో పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ (Hyderabad)లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City)లో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ (Telangana Rising) బృందం ఈ మేరకు దావోస్ లో యూపీసీ వోల్ట్ (UPC Volte) సంస్థతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.
100 మెగావాట్ల సామర్థ్యంతో
యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మేరకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్ నెలకొల్పనుంది.
Big boost to Telangana’s AI data center ambitions at #WEF2026 Davos.
Chief Minister Shri @revanth_anumula – led #TelanganaRising delegation signed an MoU with UPC Volt (a JV of UPC Renewables Group & VOLT Data Centers) to set up a 100 MW AI-ready data center in… pic.twitter.com/dznRlSkG6h
— Telangana CMO (@TelanganaCMO) January 22, 2026
రూ.5000 కోట్ల పెట్టుబడి..
ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం యూపీసీ వోల్ట్ సంస్థ.. ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
Also Read: TDP Cadre on YS Jagan: అసెంబ్లీకి రాడట.. కానీ పాదయాత్ర చేస్తాడట.. జగనన్న మీకిది తగునా!
సీఎం రేవంత్ రియాక్షన్
ఏఐ డేటా సెంటర్ ఒప్పందం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్ లో భాగమని అన్నారు. కాగా ఈ భేటిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

