Congress vs BRS: మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార కాంగ్రెస్‌పై విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కత్తులు (Congress vs BRS) దూస్తున్నాయి. ముఖ్యంగా, ఇటీవలే పూర్తయిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన గులాబీ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ మునిసిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇందుకోసం పార్టీ శ్రేణులను అన్ని విధాలా సమాయత్తం చేస్తోంది. అయితే, విపక్షానికి అంత సీన్ లేదని అధికార పక్షం ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే పురపోరులోనూ మట్టికరిపిస్తామని ఘంటాపథంగా చెబుతోంది. ఇవే విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) మరింత స్ట్రాంగ్‌గా, బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) సన్నాహక సమావేశం వేదికగా కేటీఆర్‌కు (KTR) మంత్రి డేరింగ్ సవాల్ విసిరారు.
Read Also- Singareni: సింగరేణి టెండర్లతో అసలు లబ్ధి పొందింది ఎవరు?.. దాచి పెట్టినా దాగని వాస్తవాలు ఏంటి..?
‘‘కేటీఆర్ మాట్లాడుతూ పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. రెండుమూడేళ్లైతే వచ్చే మా ప్రభుత్వమే, మీ అంతు చూస్తామని అంటున్నారు. అయ్యా.. కేటీఆర్ నువ్వు మరచిపోకు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా వచ్చింది. ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేదు. మేము అలా కాదు. మీ నాయన పదేళ్లు ముఖ్యమంత్రి ఉండి, నువ్వు డీఫాక్టో ముఖ్యమంత్రిగా ఉన్నా.. నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్లు వేసి రూపాయి ఖర్చుపెట్టకుండా మూడు పార్లమెంట్ స్థానాలను గెలిచాం. నువ్వు పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క లోక్‌సభ స్థానం గెలవలేదు. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌లో మీ సభ్యులు చనిపోతేనే మీరు గెలిపించుకోలేదు. ఇక, రెండేళ్లలో అధికారంలోకి వస్తారంటే అదొక పెద్ద జోక్ లాగా అనిపిస్తోంది. ఇవి పార్టీ గుర్తు ఎన్నికలు కదా. 10 -20 శాతం కార్యకర్తలు వెళ్లిపోతారనే భయంతో మొన్నటిదాకా ఊర్లలో తిరిగారు. ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నా కేటీఆర్… 10 శాతం మున్సిపాలిటీలు గెలువు. దేనికంటే దానికి సిద్ధం నేను’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Read Also- TDP Cadre on YS Jagan: అసెంబ్లీకి రాడట.. కానీ పాదయాత్ర చేస్తాడట.. జగనన్న మీకిది తగునా!
కాంగ్రెస్-బీఆర్ఎస్ నువ్వా-నేనా
మునిసిపల్ ఎన్నికలకు కనీసం నోటిఫికేషన్ కూడా వెలువడముందే రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరినట్టుగా కనిపిస్తోంది. మునిసిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లోనైనా రాణిస్తే కేడర్‌లో ధైర్యం నింపాలని, లేదంటే కేడర్ నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతోంది. రెండు ఉపఎన్నికల్లోనూ సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం కలవరపడుతోంది. అందుకే, మునిసిపల్ ఎన్నికల్లో బలం చాటాలని గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
అయితే, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి ఆత్మవిశ్వాసం, చాలా ధీమాతో కనిపిస్తోంది. పల్లె పోరులో ఏ విధంగా సత్తా చాటామో.. అంతకుమించి రాణిస్తామని మంత్రులు ఘంటాపథంగా చెబుతున్నారు. విపక్షాన్ని మళ్లీ మట్టికరిపిస్తామని కాంగ్రెస్ నాయకులు, నేతలు ధీమాగా చెబుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నేరుగా టార్గెట్ చేసి మరీ ఆయన సవాల్ విసిరారు.
మొత్తానికి, మునిసిపల్ ఎన్నికలు-2026 కేవలం స్థానిక సంస్థలుగా పార్టీలు చూడడం లేదు. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఒక సెమీ ఫైనల్‌గా భావిస్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ధోరణి చూస్తుంటే మునిసిపల్ ఎన్నికలు వాడీవేడిగా జరగడం ఖాయం!.

