Bhatti Vikramarka Row: తొలుత ఒక ఐఏఎస్ అధికారిణి, ఒక మంత్రికి మధ్య ఏదో నడుస్తోందంటూ సంచలన ఆరోపణలతో వార్త కథనం.. ఆ తర్వాత సదరు మీడియా ఛానల్‌పై కేసు, జర్నలిస్టుల అరెస్టు.. తాజాగా, మరో మీడియా సంస్థ అధినేత ఏకంగా డిప్యూటీ సీఎంపైనే (Bhatti Vikramarka Row) అవినీతి ఆరోపణలు!. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న వ్యవహారం ఇదీ. ఇక్కడ మరొక వ్యక్తి అంటే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సన్నిహితులుగా పేరున్న ఓ ఒక మీడియా అధినేత. ఒడిశాలో ఉన్న నైని బొగ్గు గని టెండర్ల నిబంధనలను సింగరేణి మార్చివేసిందని, ‘ఫీల్డ్ విజిట్’ నిబంధన తీసుకొచ్చిన సింగరేణి సంస్థ డిప్యూటీ సీఎం చేతుల్లో ఉందనేది ఆదివారం నాడు ఓ పత్రికలో ప్రచురితమైన కథనం సారాంశం. ఈ కథనంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెంటనే స్పందించారు. మృదుస్వభావిగా కనిపించే భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించి మరీ.. తనపై అవినీతి ఆరోపణలు చేసి మీడియా పత్రిక అధినేతపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో అసలేంటి నిబంధన మార్పు వివాదం, ‘ఫీల్డ్ విజిట్’ అంటే ఏమిటి?.
భట్టి విక్రమార్కపై ఆరోపణలు గుప్పించిన పత్రిక కథనం ప్రకారం, ఒడిశాలోని నైని బొగ్గు గని తవ్వకాల కోసం పిలిచిన టెండర్లలో నిబంధనలను ఒకరికి అనుకూలంగా మార్చారనేది ఆరోపణగా ఉంది. ఇంతకీ ఈ నిబంధన ఏమిటంటే, బొగ్గు గని దక్కించుకోవడానికి అవసరమైన టెండర్ వేయడానికి ముందే.. ఆసక్తివున్న కంపెనీలు ముందుగానే గనిని సందర్శించాల్సి ఉంటుంది. దీనినే ఫీల్డ్ విజిట్ (Field Visit) నిబంధన అంటారు. ఒడిశాలో కేంద్రం కేటాయించిన నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో సింగరేణి సంస్థ ఈ నిబంధననే తీసుకొచ్చింది. అయితే, ఇది కావాలనే.. కొన్ని కంపెనీలను తప్పించి, తమకు కావాల్సిన వారికి చెందిన కంపెనీకి కట్టబెట్టడానికేనన్నది ఆరోపణ చేసిన పత్రిక ఉద్దేశం. అందుకే, భట్టి విక్రమార్క వెంటనే స్పందించారు. ఫీల్డ్ విజిట్ తాను పెట్టిన నిబంధన కాదని, అది సింగరేణి సంస్థ నిర్ణయమని, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇదే విధానం ఉందంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ నిబంధనతో నచ్చినవారికి మేలు చేయవచ్చా?
ఏదైనా టెండర్ ప్రక్రియలో ఒక కొత్త నిబంధన చేర్చినప్పుడు, దానికి సంబంధించిన సమాచారం అన్ని కంపెనీలకు ఒకేసారి తెలుస్తుందని భావించలేదు. పారదర్శకత కోసం తెచ్చారా?, లేక ఎవరి కోసమైనా తెచ్చారా? అనే చర్చ పక్కనపెడితే, ఈ నిబంధన అమలు చేస్తే, ఏ ఏ కంపెనీలు టెండర్ వేయబోతున్నాయో అధికారులకు, ప్రత్యర్థి కంపెనీలకు ముందే తెలిసిపోతుంది. ఇదివరకు మాదిరిగా వివరాల గోప్యత ఏమీ ఉండదు. అయితే, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న గనులను సందర్శించడానికి టెండర్ నోటీసులో చాలా తక్కువ సమయం ఇస్తే, దూర ప్రాంతాల్లో ఉండే కంపెనీలు సకాలంలో సమాచారం అందుతుందా?, అక్కడికి చేరుకుంటాయా? అన్నది ఇక్కడ వ్యక్తమవుతున్న అనుమానాలు. ఈ నిబంధన ప్రకారం.. ముందే సమాచారం ఉన్న కంపెనీలు, ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కంపెనీలు బొగ్గు గని విజిట్ పూర్తి చేసి టెండర్ రేసులో ముందుంటాయి. అయితే, కొత్త నిబంధనపై అవగాహన లేని, నిర్దేశిత గడువు లోగా అక్కడికి చేరుకోలేని కంపెనీలకు నష్టం జరిగే అవకాశం ఉంది. తద్వారా అర్హత ఉన్న కంపెనీలు కూడా అనర్హతకు గురయ్యే ఛాన్స్ ఉంటుంది.
Read Also- Honeytrap Couples: 1500 మందిని హనీ ట్రాప్.. 100 మందితో శృంగారం.. ఈ కపుల్ సమాజానికే సిగ్గుచేటు!
సూటిగా చెప్పాలంటే, ఫీల్డ్ విజిట్ నిబంధన మంచిదే అయినప్పటికీ, దాన్ని అమలు చేసే విధానం, సమయం సరిగ్గా లేకపోతే మాత్రం అర్హులైన వారిని తప్పించి, అనుకూలమైన వారిని ఎంపిక చేసేందుకు కూడా ఒక అస్త్రంగా మారుతుందనేది ప్రధాన విమర్శ. మరి, నైని కోల్ బ్లాక్, దానిని దక్కించుకునే టెండర్ నిబంధన విషయంలో చెలరేగిన ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

