Tiger Estimation 2026: తెలంగాణ అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్యను, వన్యప్రాణుల స్థితిగతులను శాస్త్రీయంగా అంచనా వేసేందుకు అటవీ శాఖ సర్వం సిద్ధం చేసింది. ప్రతి నాలుగేళ్లకొకసారి నిర్వహించే ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2026’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19 నుంచి 25 వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్త గణన చేపట్టనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ త్రివిధ దళాల అధికారి సువర్ణ వివరాలను వెల్లడించారు.
3,053 బీట్లలో క్షేత్రస్థాయి సర్వే
రాష్ట్రంలోని టైగర్ రిజర్వులు (అమ్రాబాద్, కవ్వాల్), వన్యప్రాణి అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్టులతో కలిపి మొత్తం 3,053 అటవీ బీట్లలో ఫీల్డ్ డేటా సేకరణ జరగనుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సర్వే సాగనుంది. పులులు, ఇతర వన్యప్రాణుల పాదముద్రలు, మల నమూనాలు, చెట్లపై గోర్ల గుర్తులను సిబ్బంది నమోదు చేస్తారు. వీటితో పాటు ఆహార జంతువుల సాంద్రత, అటవీ నివాస స్థితి, అడవిలో మానవ కార్యకలాపాల ప్రభావాన్ని కూడా ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా రికార్డు చేయనున్నారు.
భారీగా తరలివచ్చిన వలంటీర్లు
వన్యప్రాణి సంరక్షణపై ఉన్న మక్కువతో ఈ గణనలో పాల్గొనేందుకు 1,129 మంది వలంటీర్లు ముందుకు రావడం విశేషం. వీరితో పాటు డబ్ల్యూడబ్ల్యూఎఫ్, అనిమల్ వారియర్స్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వంటి సంస్థలకు చెందిన 430 మంది శిక్షణ పొందిన సభ్యులు కూడా పాల్గొంటున్నారు. వీరందరినీ జిల్లాల వారీగా విభజించి అటవీ సిబ్బంది పర్యవేక్షణలో విధులకు కేటాయించారు.
పకడ్బందీగా పులుల గణన
సర్వేలో సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా తదుపరి దశలో కెమెరా ట్రాపింగ్, శాస్త్రీయ విశ్లేషణలు చేపడతాం. పులుల సంఖ్యతో పాటు అటవీ జీవ వైవిధ్యంపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేస్తాం. ఈ కార్యక్రమం ద్వారా వన్యప్రాణి సంరక్షణలో తెలంగాణ తీసుకుంటున్న చర్యలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనున్నాయి. సువర్ణ, అటవీ శాఖ త్రివిధ దళాల అధికారి సువర్ణ తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు.. రాధాకృష్ణపై భట్టి విక్రమార్క ఫైర్!

