Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల విషయంలో ఆంధ్రజ్యోతి రాసిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాసిన రాతలు పూర్తి అవాస్తవమని కొట్టిపారేశారు. ఆస్తులను సృష్టించుకోవడం కోసమో, వ్యాపారాలను విస్తరించుకోవడం కోసమే తాను రాజకీయాల్లోకి రాలేదని భట్టి స్పష్టం చేశారు. ఓ ప్రత్యేక లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ఆస్తులను, వనరులను, వ్యవస్థలను సమాజంలోని అన్ని వర్గాలకు పంచడమే నా ఉద్దేశ్యమన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మ అన్న భట్టి.. దానిని కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే తన ఏకైక లక్ష్యంగా పేర్కొన్నారు.
‘నా జీవితం తెరిచిన పుస్తకం’
గద్ద లాంటివాళ్ళు సమాజం మీద పడి పీక్కు తింటుంటే వారి నుంచి సమాజాన్ని రక్షించడానికి రాజకీయాల్లోకి వచ్చానని భట్టి విక్రమార్క అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో కథనంలో చెప్పినట్లుగా టెండర్ నిబంధనలకు మంత్రికి ఎలాంటి సంబంధం ఉండదని భట్టి అన్నారు. ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా కట్టుకథలు అల్లి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసం నాపై కథనాలు రాశారని మండిపడ్డారు. ఆ నిబంధనలను సింగరేణి బోర్డు ఖరారు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆరోపణలు వచ్చిన వెంటనే టెండర్లను రద్దు చేయాల్సిందిగా బోర్డుకు సూచించినట్లు భట్టి చెప్పుకొచ్చారు. మంత్రిగా బాధ్యతల్లో ఉన్నంత కాలం దోపిడీదారులను క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులు, వ్యవస్థలపై పడకుండా రక్షిస్తానని హామీ ఇచ్చారు.
‘కట్టుకథలతో నన్నేం చేయలేరు’
మరోవైపు వ్యక్తుల క్యారెక్టర్ హననం చేసే హక్కు ఎవరికీ లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే తమ క్యాబినెట్ మొత్తం పని చేస్తుందన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో సభ లోపల, బయటి సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేశానని గుర్తుచేశారు. తనపై కట్టు కథలు అల్లి రాసినవారికి ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చని భట్టి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కోపంతో తనపై రాసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన వెనకాల ఎవరుండి రాయించారో తర్వాత మాట్లాడతానని భట్టి పేర్కొన్నారు. మంత్రుల మధ్య గొడవలు పెడతామంటే కుదరదని స్పష్టం చేశారు. తాను ఆత్మగౌరవంతో బతుకుతున్నానన్న భట్టి.. ఏ ఛానల్ అయినా ఎవరి ఇమేజ్ దెబ్బ తీయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. కట్టుకథలు అల్లి తనను ఏం చేయలేరని.. తాను అంత వీక్ క్యారెక్టర్ కాదన్నారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పారదర్శకత కోసం టెండర్లు రద్దుకు పిలుపునిచ్చానని.. మిగతా విషయాలన్నీ తాను, రాధాకృష్ణ మాట్లాడుకొని తేల్చుకుంటామని భట్టి చెప్పుకొచ్చారు.
కట్టుకథలు అల్లి రాసినవారికి ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు: భట్టి
టెండర్లు రద్దు చేయమని సింగరేణిని ఆదేశించాను
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కోపంతో నాపై రాసి ఉండొచ్చు
అన్ని విషయాలు నేను, రాధాకృష్ణ మాట్లాడుకుంటామని చెప్పి టెండర్లు రద్దు చేయమన్నాను
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క pic.twitter.com/hZa6v9PxaZ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2026
Also Read: Bhatti Vikramarka: విద్యారంగంలో సరికొత్త చరిత్ర.. గేమ్ చేంజర్’గా ఇంటిగ్రేటెడ్ స్కూల్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!
భట్టిపై వచ్చిన కథనం ఏంటీ?
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐఏఎస్ అధికారిణిలపై వచ్చిన ఎన్టీవీ కథనం వెనుక సింగరేణి పరిధిలోని నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ అంశం ఉన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. ప్రస్తుతం సింగరేణి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిధిలోనే ఉందని, ఈ క్రమంలోనే కొత్త కంపెనీలు సైతం టెండర్ దక్కించుకునేందుకు వీలుగా సింగరేణి బోర్డు ఒక కొత్త నిబంధన తీసుకొచ్చిందని రాసుకొచ్చింది. అనుభవంతో పని లేకుండా.. క్షేత్ర సందర్శన చేసిన కంపెనీ మాత్రమే టెండర్ లో పాల్గొనాలని షరతు పెట్టిందన్నారు. అయితే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ను తాము అనుకున్న జాయింట్ వెంచర్ కంపెనీకే ఇచ్చి అనుభవమున్న, బలమైన కంపెనీలను టెండర్ల నుంచి దూరం పెట్టాలని దీని వెనకున్న అసలు ప్లాన్ అని వీకెండ్ ఎపిసోడ్ లో సదరు మీడియా సంస్థ ఆరోపించింది. భట్టి విక్రమార్క, ఎన్టీవీ ఎండీ నరేంద్ర చౌదరి అల్లుడు.. మేఘా కంపెనీతో జత కట్టి ఈ టెండర్ దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సదరు కథనం పేర్కొంది. మరోవైపు తన సోదరుడికి ఈ టెండర్ దక్కేందుకు ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడ్డుకునేందుకు ఎన్టీవీలో అసభ్యకర కథనాన్ని ప్రసారం చేశారని వీకెండ్ ఎపిసోడ్ లో సదరు మీడియా ఆరోపణలు చేసింది.

