తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : చిలుకూరు బాలాజీ మందిరం ప్రధాన అర్చకుడు రంగరాజన్ (Chilukuru Rangarajan) పై దాడి కేసులో ప్రధాన నిందితునితోపాటు మరో అయిదుగురిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్టు చెప్పారు. తాను స్థాపించిన రామరాజ్యం ఆర్మీలోకి రిక్రూట్ మెంట్లు జరపటంతోపాటు ఆర్థిక వనరులు సమకూర్చాలన్న డిమాండ్ తో ప్రధాన నిందితుడు తన మనుషులతో కలిసి రంగరాజన్ పై దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు.
ఈనెల 7న ఉదయం 8గంటల సమయంలో ప్రస్తుతం మణికొండ ప్రాంతంలో నివాసముంటున్న తూర్పుగోదావరి జిల్లా కొప్పూరు గ్రామ నివాసి వీర రాఘవరెడ్డి 25మందితో కలిసి ఇంట్లోకి చొరబడి మరీ చిలుకూరు బాలాజీ ఆలయం పూజారి రంగరాజన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిర్యాదు రాగా వెంటనే రంగంలోకి దిగిన మొయినాబాద్ పోలీసులు అదే రోజున వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈనెల 8న ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాల నుంచి దాడికి పాల్పడ్డ ఇద్దరు మహిళలతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు.
రంగరాజన్ (Chilukuru Rangarajan) పై దాడి నిందితుడి హిస్టరీ
2022లో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి ఫేస్ బుక్, యూట్యూబ్ తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో రామరాజ్యం పేరిట అకౌంట్స్ క్రియేట్ చేశాడు. హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి రామరాజ్యం ఆర్మీని ప్రారంభించినట్టు ప్రచారం చేసుకున్నాడు. భగవద్గీతలోని శ్లోకాలను సోషల్ మీడియాలో, వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తూ తాను స్థాపించిన రామరాజ్యం ఆర్మీలో చేరాలంటూ ప్రచారం చేసుకున్నాడు. చేరిన వారికి నెలకు 20వేల రూపాయలు జీతం ఇస్తానని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో గతనెల 24న 25మంది తణుకులో వీర రాఘవ రెడ్డిని కలిసి రామరాజ్యం ఆర్మీలో చేరారు. అక్కడి నుంచి కోటప్పకొండకు వెళ్లి ఒక్కొక్కరు 2వేల రూపాయలు ఖర్చు చేసి నలుపు రంగు డ్రెస్సులు కుట్టించుకున్నారు. ఆ తరువాత అంతా హైదరాబాద్ వచ్చి యాప్రాల్ లో కలుసుకున్నారు. అక్కడ ఫోటోలు తీసుకున్నారు. అనంతరం వీర రాఘవరెడ్డితో కలిసి మూడు వాహనాల్లో రంగరాజన్ ఇంటికి వచ్చి ఆయనపై దాడికి పాల్పడ్డారు. పరారీలో ఉన్న మిగితా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని కమిషనర్ తెలిపారు.
Also Read : రంగరాజన్ కి సీఎం రేవంత్ ఫోన్.. అధికారులకు కీలక ఆదేశాలు