ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defected MLAs) అనర్హత పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా, బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.
విచారణ సందర్భంగా నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేల (Defected MLAs)కు స్పీకర్ నోటీసులు జారీ చేశారని ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. అయితే నిర్ణయం తీసుకోడానికి ఎంత సమయం తీసుకుంటారో… స్పీకర్‌తో సంప్రదించి వివరాలు అందించాలని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా స్పీకర్‌ని సంప్రదించేందుకు తమకు మరికొంత సమయం కావాలని ముకుల్ రోహత్గి మరోసారి సమయం కోరగా బీఆర్ఎస్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.
గత విచారణ సమయంలో కూడా ఇదే సమాధానం చెప్పారని, ఎలాంటి పురోగతి లేదని శేషాద్రి నాయుడు వివరించారు. దీంతో ఇప్పటికే పది నెలలు అయ్యింది… ఇంకా ఎంత సమయం తీసుకుంటారని అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. స్పీకర్ నిర్ణయం కోసం ఇప్పటికే తాము సంప్రదించామని, తగిన సమయంలో నిర్ణయం తీసుకునే విషయంలో మరోసారి సంప్రదించి చెబుతామని ముకుల్ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు.
Also Read : కవిత ఫ్యూచర్ ఖతమేనా.. మైలేజ్ రాకుండా ఒంటరి చేసే యత్నం??
తగిన సమయం అంటే… ఎంత అని మరోసారి ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం… సరైన సమయం అనేదానికి కూడా ఒక అర్ధం ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. సరైన సమయం అంటే ఏంటి? సరైన సమయంపై స్పీకర్‌కి సూచనలు ఇవ్వాడానికి ఉన్న అవకాశాలపై కూడా వాదనలు విని… తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం ముకుల్ రోహత్గి విజ్ఞప్తి మేరకు కేసు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
కాగా, 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను (Defected MLAs) అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టులో రెండు వేరు వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ఒక పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదని కేటీఆర్ మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు కలిపి సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది.