Gandipet
తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్

Gandipet | గండిపేటలో దండిగా భూ ఆక్రమణలు.. BRS హయాంలో కొల్లగొట్టిన వాటిపై ఫోకస్

రంగారెడ్డి, స్వేచ్ఛ: రంగారెడ్డి జిల్లాలోని గండి పేట (Gandipet) ప్రాంతం.. భూ అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. రూ.కోట్లు విలువ చేసే భూములను స్వాహా చేసేందుకు అక్రమార్కులు బరితెగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘ధరణి’లోని లొసుగులను అడ్డం పెట్టుకొని.. కొంతమంది పెద్దల ఆశీస్సులు, అధికారుల అండదండలతో రూ.వందల కోట్ల విలువ జేసే ప్రభుత్వ భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో గుట్టుగా సాగిన అక్రమ భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా..రూ.1500 కోట్ల అక్రమ భూ వ్యవహారం వెలుగులోకి రాగా..గతంలోనూ రూ.750 కోట్ల భూములను కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నాలను అధికారులు పటాపంచలు చేశారు.


వందల కోట్ల భూమికి ఎసరు!

అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్న క్రమంలో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గండిపేట (Gandipet) మండలం నెక్నాంపూర్‌లో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఓ అక్రమార్కుడు యత్నించగా.. అధికారులు భగ్నం చేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తున్నది. సర్వే నం.20, 28, 44 లో ఉన్న 30 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తుల నుంచి ఇబ్రహీం అనే వ్యక్తి 1975 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లుగా బోగస్ పత్రాలు సృష్టించాడు.

పట్టాదారు పుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేయగా.. ఈ-పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ భూములు ఇబ్రహీంకు సంబంధించినవే అని నిర్ధారిస్తున్నట్లుగా అప్పటి కలెక్టర్‌ భారతి హోలికేరి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒరిజినల్‌ పట్టాదారు పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకోగా.. అనుమానం వచ్చి అధికారులు తిరస్కరించారు. దీనిపై హైకోర్టులో ఇబ్రహీం రిట్‌ పిటిషన్‌ వేయగా..పరిశీలించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుత కలెక్టర్‌ నారాయణ రెడ్డి విచారణ చేసి అంతా బోగస్ అని తేల్చేశారు. 30 ఎకరాలకు సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్స్​ ‍లేకపోగా..ఆన్‌లైన్‌లో సంబంధిత రికార్డులు సైతం లేవని గుర్తించారు. దీంతో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఇబ్రహీంపై కేసు నమోదైంది.


గతంలోనూ రూ.750 కోట్ల భూములు స్వాధీనం

గత ప్రభుత్వ హయాంలో గండిపేట (Gandipet) ప్రాంతంలో రూ.కోట్ల విలువ జేసే ప్రభుత్వ స్థలాలను కొందరు కాజేయగా..కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటపడుతున్నాయి. గంధంగూడ సర్వే నం.51లో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమిపై మాజీ కార్పొరేటర్‌ కన్ను పడింది. అధికారులు కూడా సహకరించడంతో పక్కా ప్రణాళికతో ఆ భూమిని కాజేసేందుకు స్కెచ్‌ వేశాడు. 2018 వరకు ప్రభుత్వ భూమిగానే రికార్డులో ఉండగా..2023 మే నెలలో ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి భూములు వెళ్లాయి. అప్పటి కలెక్టర్‌ పట్టాదారు పుస్తకాన్ని సైతం జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం బయటకు పొక్కడంతో విచారణ నిర్వహించిన అప్పటి కలెక్టర్‌ శశాంక సమగ్ర విచారణ నిర్వహించారు.

ఈ అక్రమ తంతులో కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు సహకరించారని తేలింది. ఆ తర్వాత పాస్ పుస్తకాలను రద్దు చేసి సదరు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఎకరం భూమి రూ.25 కోట్ల నుంచి రూ.30కోట్ల వరకు ఉండగా.. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమి పరాధీనం కాకుండా అధికార యంత్రాంగం కాపాడింది. అలాగే.. గండిపేట మండలం పొక్కల్‌వాడ గ్రామ సర్వే నంబర్‌లోని 62.06 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు, రియల్టర్లు కలిసి కాజేసే ప్రయత్నం చేయగా..అధికారులు అడ్డుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో అధికారులుండగా..ఈ అక్రమ తంతు సాగింది. విచారణలో అక్రమాలు నిర్ధారణ కాగా.. రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి కాపాడారు.

ఆ.. 98 దస్త్రాల విచారణ ఏమాయే..!

రంగారెడ్డి జిల్లాలో 2023 అక్టోబర్‌, నవంబర్‌ లో 98 దస్ర్తాలకు సంబంధించి ధరణిలో అక్రమ లావాదేవీలు జరిగాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సైతం రిజిస్ట్రేషన్లు జరిగాయని గుసగుసలు వినిపించాయి. కలెక్టర్‌ దగ్గర దీనికి సంబంధించి ‘కీ’ ఉండగానే ఈ వ్యవహారం చోటుచేసుకున్నదని పలువురు ఆరోపించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అప్పటి కలెక్టర్‌ భారతిహొలికేరిపై బదిలీవేటు వేసింది. బాధ్యులైన ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుగుతున్నా.. స్పష్టత లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

వాస్తవాలు వెలుగులోకొస్తే.. అప్పట్లో ఎవరెవరి పేరున భూముల బదలాయింపు జరిగింది? ఎంత సొమ్ము చేతులు మారింది! అన్నది తేలనున్నది. ఇందులో సూత్రధారులు, పాత్రదారులెవరో కూడా తేలనున్నది. ఇప్పటికే ఎన్నో భూ బాగోతాలను వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వం ఆ 98 దస్త్రాల గుట్టును సైతం తేల్చాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి కలెక్టర్ భారతీ హోలికేరికి ఉచ్చు బిగుసుకుంటున్నట్టు తెలుస్తున్నది.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?